నల్లగొండ: "ఆంధ్రనేతలు దోచుకుంటుంటే మన సన్నాసులకు మనది మనక్కావాలని అడిగే దమ్మూ ధైర్యం లేదు. చవటలు, దద్దమ్మలు" అని తెలంగాణ నేతలపై కెసిఆర్ మండిపడ్డారు. ఆదివారం ట్రినిటి విద్యాసంస్థల చైర్మన్ మనోహర్ రెడ్డిసహా పలువురు టీఆర్ ఎస్ లో చేరారు. నల్లగొండలోనూ పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...వారినుద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులనూ ఆయన వదల్లేదు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో పోతున్నప్పటికీ తెలంగాణకు నీరిచ్చే దిక్కు లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఉప ఎన్నికల్లో తన కు ఓటు వేస్తే తెలంగాణ వచ్చేదాక నిద్రపోనన్నారని, ఇంతమంది విద్యార్థులు చనిపోయినా స్పం దించని ఆయన తీరు 'తంతే లేవనోడు గోకితే లేస్తాడా' అన్నట్టుందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీలో ఉండి కూడా మధు యాష్కీ తెలంగాణ కావాలని మాట్లాడుతున్నారని కొనియాడారు.