తెలంగాణ విడిచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో సాము

తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులతో పాటు చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం లేదు. అయితే, నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి ఎంత మంది తెలంగాణ నాయకులు కదులుతారనేది ప్రశ్ననే. ఈ యాత్ర వల్ల చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్ముతారా అనేది పెద్ద సందేహం. తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు బాబ్లీ యాత్ర తలపెట్టి పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయినా, ఆయన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తెలంగాణ ప్రాంతంలో తిరగలేని స్థితిలో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలన్నీ నేల విడిచి సాము చేయడమే అవుతుందనే వ్యాఖ్య వినిపిస్తోంది.
తెలంగాణపై తన వైఖరి మారలేదని చంద్రబాబు అవసరమైన వేళ మాత్రమే చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత తెలంగాణకు అడ్డం తిరిగింది చంద్రబాబే అనే విమర్శ ఉంది. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ యాత్ర పెట్టి మిగతా పార్టీలను ఇరకాటంలో పెట్టాలని భావించారు. సోనియా ఇంటి వద్ద ధర్నాకు రావాలని అన్ని పార్టీలకు నాగం జనార్దన్ రెడ్డి ఆహ్వానాలు పలికారు. ఏ ఒక్క పార్టీ కూడా అనుకూలంగా ప్రతిస్పందించలేదు. పైగా, కాంగ్రెసు సహా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వరకు తెలుగుదేశం పార్టీపైనే విరుచుకుపడ్డాయి. అందువల్ల మిగతా పార్టీలను ఇరకాటంలో పెట్టేంత సీను కూడా తెలుగుదేశం నాయకుల ఢిల్లీ యాత్రకు లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications