వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీ తీరును ప్రశ్నించిన కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: ఏఐసీసీ సమావేశం ఆహ్వాన జాబితాలో తన పేరు, మాజీ మంత్రి మారెప్ప పేరు లేకపోవడంపై ఏఐసీసీ కో ఆప్టెడెడ్ సభ్యురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. బీసీ మహిళ అయిన తనను, ఎస్సీ అయిన మారెప్పను మినహాయించడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. కొంత మంది కాంగ్రెసు నాయకులపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్న కేకే, కాకా, వీహెచ్, లగడపాటి, రాయపాటి, దగ్గుబాటి, కావూరి లాంటి నాయకుల పేర్లను ఆహ్వానితుల జాబితాలో ఉంచి బీసీ మహిళనైన తన పేరు తీసివేయడం దేనికో అర్థం కావట్లేదని ఆమె సోనియాకు రాసిన లేఖలో అన్నారు. వైఎస్ మరణానంతరం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా రాహుల్ గాంధీ 2014లో ప్రధాని కావాలన్న వైఎస్ అభీష్టం మేరకు జగన్‌కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆమె గుర్తు చేశారు.

పార్టీ మేలు కోరాను కానీ, ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదని, ప్రజాబలం లేకున్నా నాయకులుగా చెప్పుకొనేవారు ఈ సంవత్సర కాలంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, పార్టీ బాగు కోసం మంత్రి పదవిని వదులుకున్నా తన పేరు క్రమ శిక్షణ చర్యలకు గురైన వారి జాబితాలో చేర్చడం ఎంత వరకు సమంజసమని ఆమె అన్నారు. ఎలాంటి ప్రజాబలం లేని వీహెచ్, కేకే ఇటీవల మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కార్యకర్తల మీదికి వెళ్లి వీధి రౌడీల్లా ప్రవర్తించడం క్రమశిక్షణ రాహిత్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. మొన్న తెలంగాణలో ఉప ఎన్నికలకు ముందు మన పార్టీలోనే ఎంపీగా ఉన్న మధు యాష్కీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణ రాహిత్యం కావా? అని, స్వయంగా ముఖ్యమంత్రి 'నేను పొరపాటునో గ్రహపాటునో సీఎం అయ్యాను' అన్న మాటలు క్రమశిక్షణ కిందికి రావా? అని ఆమె అడిగారు. ఒక మహిళ అధ్యక్షురాలిగా ఉన్న ఇంత పెద్ద పార్టీలో బీసీ మహిళకు ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానం అందకపోవడం తమ తెలంగాణ మహిళలను అవమానించడమేనని ఆమె అన్నారు. ఈ సందేశం రాష్ట్రంలోకి పోకముందే ఈ చర్యను సరిదిద్దుకోవాలని సురేఖ తన నాలుగు పేజీల సుదీర్ఘ లేఖలో కోరారు. ఏఐసీసీ సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడా? లేక ఆయనే కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నాడా అర్థం కావట్లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X