• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోనియా మనసేమిటో తెలియక రాష్ట్ర కాంగ్రెసు నేతల తికమక

By Pratap
|
Sonia Gandhi
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచనేమిటో తెలియక రాష్ట్ర కాంగ్రెసు నాయకులు అయోమయంలో పడిపోతున్నారు. సోనియా ఏం చేయబోతున్నారో, రాష్ట్ర పార్టీ పరిస్థితిని ఎలా కొలిక్కి తేబోతున్నారో, ఎవరి భవిష్యత్తు ఏం కానుందో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకుల్లో ఉత్కంఠ, ఆసక్తి, ఆందోళన నెలకొని ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడి నియామకంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, నామిటేడ్ పోస్టుల భర్తీ జరగాల్సి ఉంది. చాలా కాలంగా ఏదీ కొలిక్కి రావడం లేదు. సోనియా మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర నేతలు చెబుతున్న విషయాలను సోనియా సావధానంగా విని తల పంకిస్తున్నారు. అంతకుమించిన స్పందన ఆమె నుంచి కనిపించడం లేదు. రాష్ట్ర నేతలు కాస్త అతి చేస్తు న్నారని భావిస్తే.. ఇక చాలన్నట్లు నాకంతా తెలుసంటూ ముక్తసరిగా మాట్లాడుతున్నారు.

నవంబర్ రెండో తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం అనంతరం సంస్థాగతంగా భారీ మార్పులూ చేర్పులూ ఉంటాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సీడబ్ల్యుసీ ఏర్పాటు, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ ఉంటాయి. అందులో భాగంగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ మారితే, పీసీసీ అధ్యక్షుని నియామకం ఉంటుందని భావిస్తున్నారు. దానికి తోడు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా అప్పుడే అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని చాలా మంది శాసనసభ్యులు ఆశపెట్టుకున్నారు. డిసెంబర్ 31 లోగా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికని కేంద్రానికి ఇవ్వనుంది. ఆలోగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం నడుం బిగిస్తుందని నేతలు భావిస్తూ వచ్చారు. అయితే, హఠాత్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉదంతం తెర మీదకు వచ్చింది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే పనిలో అధిష్ఠానం తలమునకలయింది. దీంతో రాష్ట్రానికి సంబంధిచిన అంశాలు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది.

అధిష్ఠానం పెద్దలతో మాటా మంతీ జరిపేందుకు మంత్రి దానం నాగేందర్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సోమవారం రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. మంత్రులూ అదే రోజు ఆయన బాటే పట్టనున్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం కలిశారు. చిత్తూరు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం. మొత్తం మీద, రాష్ట్ర కాంగ్రెసులోనూ, ప్రభుత్వంలోనూ సంభవించే పరిణామాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X