తుఫాను గండం తప్పింది, వర్షాలకు భారీ నష్టం తప్పలేదు

రాష్ట్రంలో గత 9 రోజులుగా కురిసిన వర్షాలకు మొత్తం 8 లక్షల ఎకరాల్లోని పంటలు మునిగిపోయినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మరో మూడ్నాలుగు రోజుల పాటు ఇదేస్థాయిలో వర్షాలు కొనసాగితే పంట నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే మునిగిపోయిన పంటలతో 8.08 లక్షల టన్నుల ఉత్పత్తి కోల్పోయామని, వీటి విలువ రూ.672.48 కోట్లు ఉంటుందని నిర్ధరించింది. పంటలు కోల్పోయిన రైతులకు తక్షణ సాయం (ఇన్‌పుట్ సబ్సిడీ)గా ఇచ్చేందుకు రూ.143.53 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ కమిషనర్ సునీల్‌శర్మ కోరారు. అక్టోబరు 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకూ కురిసిన వర్షాలకు 13 జిల్లాల్లో పంటలు మునిగిపోయాయి. కానీ అంతకుముందు అక్టోబరు 21 నుంచి 30 వరకూ కురిసిన వర్షాలనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 16 జిల్లాల్లో పంటలు మునిగాయని ఆయన తెలిపారు.
నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల నుంచి అదనంగా పంటలు మునిగినట్లు సమాచారం అందుతోంది. వీటి సమాచారం మంగళవారం ప్రభుత్వానికి అందనుంది. తుపాను కారణంగా చాలా జిల్లాల్లో అడపాదడపా జల్లులు, చిన్నపాటి వర్షాలు పడుతుండటంతో నేలలు చిత్తడిగా మారి పత్తి, మిరప, పప్పు ధాన్యాల వంటి పైర్లు దెబ్బతింటున్నాయి. వీటిని పూర్తిగా పంటలు మునిగిపోయిన జాబితాలో చూపటం లేదు. కానీ ఈ పంటల నుంచి దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలిపారు.












Click it and Unblock the Notifications