హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీలాగా నేనెవరినైనా హత్య చేశానా: చంద్రబాబుపై సిఎం రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: నేనేమైనా నీలా హత్య చేశానా అని ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. మామ అనే కనికరం కూడా లేకుండా వెన్నుపోటు పొడిచి కుర్చీ లాగేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా జాక్ పాట్ కొట్టావని చంద్రబాబు తనను అంటున్నారని, తానేమీ బలంతో ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పలేదని, కాంగ్రెసు నాయకత్వం తనకు బాధ్యతలు అప్పగించిందని, సైనికుడిలా నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్టీఆర్ వల్ల ఎన్నికైన శాసనసభ్యులను వైస్రాయ్ హోటల్లో పెట్టి అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ పైకి చెప్పులు విసిరి కుర్చీ లాగేసుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన విమర్శలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబు అంగీకరిస్తే తన ఆస్తులపై, చంద్రబాబు ఆస్తులపై న్యాయవిచారణ జరిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు. న్యాయవిచారణకు ఆదేశించిన తర్వాత స్టేలు తీసుకురావద్దని ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రం విసిరారు. ఏలూరు స్కామ్ విచారణపై స్టే తెచ్చిన ఘనత చంద్రబాబుదని, డబ్బులు చేతులు మారకపోతే స్టే ఎందుకు తెస్తారని ఆయన అన్నారు.

మామను హత్య చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, చరిత్రలో అలా అధికారంలోకి వచ్చినవారు ఇటీవల ఎవరూ లేరని ఆయన అన్నారు. చంద్రబాబు మల్లయుద్ధం చేస్తాడని, ఎక్సర్ సైజు చేస్తాడని, వీధుల్లోకి రావడానికి తాను అలా చేయబోనని ఆయన అన్నారు. ఎన్టీఎ ఆహ్వానిస్తే ప్రధాని పదవి నిరాకరించిన మహాత్యాగి చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. మామను చంపి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, చంద్రబాబుకు పదవీ కాంక్ష లేదని ఆయన అన్నారు. క్లింటన్ ను చంద్రబాబు రప్పించి ఏం సాధించారని ఆయన అడిగారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రపంచ నాయకుడని, బిల్ క్లింటన్, కోఫీ అన్నన్ చాలా మంది చంద్రబాబుతో మాట్లాడేవారని, చంద్రబాబు హిమాలయమంత ఎత్తు ఎదిగినవాడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

తన ఆస్తులపై, చంద్రబాబు ఆస్తులపై న్యాయవిచారణ జరిపిస్తే ఎవరు వేల కోట్ల రూపాయలు సంపాదించారో తేలుతుందని ఆయన అన్నారు. పదవి పోయిందనే దుగ్ధతో తనపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనలాగే అందరూ అక్రమంగా సంపాదించుకుంటారని చంద్రబాబు అనుకుంటున్నారని, అది అధికారం లేక చేజారిపోతుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు. నిస్పృహతో, నిరాశతో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఒకటి రెండు సార్లు తాను అనుకున్నానని, అయితే పదే పదే విమర్శలు చేస్తుంటే మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు. తనది 59 ఏళ్ల రాజకీయ జీవితమని, చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పుడు తాను రాజకీయాల్లో ఉన్నానని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాదుకు రప్పించలేకపోయారని తనపై చంద్రబాబు చేసిన విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పరిధిలో అది లేదని ఆయన చెప్పారు. తనపై విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని కాలేదని, తనకు అధికారంలోకి రావడానికి ఒక్కటే దారి ఉందని, కాంగ్రెసు నాయకత్వం నిబంధనల ప్రకారం కాంగ్రెసు శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేసిందని ఆయన అన్నారు. తన మామ మీదనే పోటీ చేస్తానని చంద్రబాబు అన్నారని, ఇటువంటి చీప్ ట్రిక్స్ పనికి రావని అప్పట్లో ఇందిరా గాంధీ అన్నారని ఆయన అన్నారు. పోరు పడలేక లోపలికి తీసుకుంటే ఒక్క పోటు పొడిచి మామను పైకి పంపించి అధికారంలోకి చంద్రబాబు వచ్చారని ఆయన అన్నారు. తానేమో నామినేటెడ్ ముఖ్యమంత్రిని, చంద్రబాబు ఎన్నికైన ముఖ్యమంత్రా అని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X