రేపు టీమిండియా టెస్ట్ మ్యాచ్ షురూ: తుదిజట్టులో కొత్త ముఖాలు
మొన్నటివరకు ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన టీమిండియా క్రికెటర్లు.. ఇక టెస్ట్ ఫార్మట్ లోకి మారిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక లాంగ్ ఫార్మట్ మ్యాచ్ ను ఆడనుంది. శనివారం ఈ గేమ్ ఆరంభం కానుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇది. 2018లో ప్రారంభమైన ఇరు జట్ల మధ్య టెస్ట్ ప్రయాణంలో ఇది రెండవ మ్యాచ్ మాత్రమే కావడం గమనార్హం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో, సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోండగా.. పేస్, స్పిన్ విభాగాల్లో సమతుల్యతతో అడుగుపెడుతోంది.

2018 బెంగళూరు టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 262 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు, అతి తక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఆఫ్ఘనిస్థాన్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి స్టార్ ఆటగాళ్లపై భారీ ఆశలు పెట్టుకుంది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు జట్టు యాజమాన్యం విశ్రాంతి కల్పించింది. జట్టులో యువతకు ప్రాధాన్యత లభించింది. భారత ఇన్నింగ్స్‌ను మరోసారి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించడం లాంఛనప్రాయమే. ప్రస్తుతం జైస్వాల్‌ను అత్యంత నమ్మకమైన టెస్టు బ్యాటర్లలో ఒకరిగా పరిగణిస్తున్నారు.
రిషబ్ పంత్ స్థానంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ లో 722 పరుగులతో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన సాయి సుదర్శన్‌ను నంబర్-3 స్థానంలో దిగనున్నట్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు కూడా. అతడికి సుదీర్ఘ అవకాశం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. దీనివల్ల దేవదత్ పడిక్కల్ తుది జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.
మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మరోవైపు వేదికపై వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెరీర్‌లో 50వ టెస్టును ఆడనున్నాడు. ఈ సందర్భంగా అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రభావితం చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి, ఆల్‌రౌండర్ పాత్రలో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.
రవీంద్ర జడేజా లేని నేపథ్యంలో ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌పై అదనపు భారం పడనుంది. అలాగే.. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించిన హర్ష్ దూబే ఈ మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బౌలర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉండగా, యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అరంగేట్రం నిరీక్షణ తప్పకపోవచ్చు.
టీమిండియా తుదిజట్టులో: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడొచ్చు.
అఫ్గానిస్థాన్ జట్టు: అబ్దుల్ మాలిక్, రెహ్మానుల్లా గుర్బాజ్, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), షరాఫుద్దీన్ అష్రఫ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, కైస్ అహ్మద్, బిలాల్ సామీ, మహమ్మద్ సలీమ్ సఫీ, నాంగ్యాలియా ఖరోటి, రెహ్మానుల్లా, సాదికుల్లా అటల్, ఇక్రం అలిఖిల్ కు అవకాశం లభించవచ్చు.












Click it and Unblock the Notifications