కెసిఆర్ అడ్డంగా దొరికితే ఉపయోగించుకోరా: సీనియర్లకు బాబు క్లాస్

ప్రధాన ప్రతిపక్షంగా కీలకాంశాలపై స్పందించే విషయంలో సీనియర్ల వ్యవహారశైలి సంతృప్తికరంగా లేదని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్టంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆయన ఉదహరించారు. తెలంగాణపై ప్రకటన చేసేముందు తమ పార్టీ వారిని సన్నద్ధం చేయకుండా కాంగ్రెస్ తొందరపాటుతో వ్యవహరించిందని నేను ఒక్కమాట అంటే దానికి నేను యూ టర్న్ తీసుకొన్నానని కేసీఆర్ పదేపదే ఆరోపణలు చేసి తెలంగాణలో తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూశాడని, ఆయితే కెసిఆర్ పై అంతకన్నా ఎక్కువ అవకాశం మనకు వచ్చిన ఇలాంటి దానిని మనం ఎందుకు వినియోగించుకోలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండి రోడ్డుమీద ధర్నా చేస్తే ఒక్కరూ స్పందించలేదన్నారు. నిషిద్ధ ప్రాంతంలో ముఖ్యమంత్రి ధర్నా చేయడం ఏమిటని నిలదీయాల్సింది. రోశయ్య తెలుగుదేశంపై, నాపై మాట్లాడినా పార్టీ సీనియర్లు స్పందించటం లేదన్నారు. మన పార్టీలో నేనుగానీ, ఇతర నాయకులు గానీ ఒక్కమాట అంటే మంత్రులు, అనేక మంది కాంగ్రెస్ నేతలు వెంటనే ఎదురు దాడి చేస్తున్నారు. మనం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు.
అధ్యక్షునిగా నేను జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నాను. ప్రతి అంశంపై ప్రజల్లో క లిసే ప్రయత్నం చేస్తున్నాను.ఆ స్థాయిలో మీరెందుకు తిరగలేకపోతున్నారు? నేను ఒక్కడ్ని పని చేయడం కాదు. అందరం కదిలి పనిచేస్తేనే పార్టీకి ఊపు వస్తుంది' అని చంద్రబాబు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాము చూస్తూ కూర్చోలేదని, ఉతికి ఆరేశామని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. అయితే, తాను ఇద్దరు ముగ్గురి గురించి చెప్పడం లేదని, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మొత్తం అన్ని జిల్లాల్లోని పార్టీ నేతలంతా స్పందించి ఎక్కడికక్కడ దాడి చేయాలని, దానికి సీనియర్లు మార్గదర్శకత్వం వహించాలన్నది తన ఉద్దేశమని బాబు వివరించారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అదుపులో ఉంచటానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నలా చేస్తుందన్నారు. అందుకే చిరంజీవిని కాంగ్రెస్‌గానీ, కాంగ్రెస్‌ను చిరంజీవి గానీ ఏమీ అనుకోకుండా జాగ్రత్త పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రోజుకో జిల్లా చొప్పున పర్యటించి రైతుల సమస్యలను ఎత్తిచూపడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications