వైయస్ జగన్ పై హైకమాండ్ సీరియస్, కుట్రలకు బ్రేక్ వేసే యోచన

ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది కోరిక మేరకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆదివారమే వైయస్ జగన్ వ్యవహారంపై నివేదిక పంపారు. సోమవారం మరో నివేదికను పంపడానికి సిద్ధమవుతున్నారు. సోనియాపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాన్ని ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భావిస్తున్నారు. వైయస్ జగన్ పై అధిష్టానం మెతక వైఖరి ప్రదర్శించబోదని, అయితే జగన్ ను ఒంటరి చేయడం ద్వారా ఫలితాలు సాధించాలని చూస్తోందని అంటున్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డారన్న ఉద్దేశంతో ఏ విధంగానైనా ఆమె తనపై చర్య తీసుకొనేలా చేసి బయటికెళ్లిపోవాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓదార్పుయాత్ర వద్దని సోనియాగాంధీ చెప్పారని బహిరంగంగా లేఖరాయడం, ఆమెకు హిందూ సంప్రదాయాలు తెలియవని, వైఎస్ కోసం చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలకు సాయం అందకుండా సోనియాగాంధీ అడ్డుపడుతున్నారనే రంగు పులమడానికి జగన్ తొలిరోజు నుంచీ ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు.
వైయస్ జగన్ ను ప్రయత్నాలను దెబ్బ తీయడానికి పార్టీ అధిష్టానం మొదటి నుంచి పకడ్బందీగానే వ్యవహరిస్తోంది. జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీని పూర్తిగా పక్కనపెట్టి నేరుగా అహ్మద్‌పటేలే వ్యవహారాలను చక్కబెట్టడం కూడా ఆ వర్గానికి వ్యతిరేకంగా పార్టీ వేసిన ముందడుగుగా చెబుతున్నారు. సాక్షి వ్యవహారంపై మాట్లాడడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నిరాకరించారు. తనకేమీ తెలియదని ఆయన తప్పించుకున్నారు. మొయిలీ వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఉన్న సోనియా వ్యవహారాలను అహ్మద్ పటేల్ కు అప్పగించారు.












Click it and Unblock the Notifications