ఫైళ్లపై తొలి సంతకాలతో సచివాలయంలో మంత్రులు బిజీ

గనుల శాఖ మంత్రిగా గల్లా అరుణకుమారి కూడా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఎన్‌సీఎల్ సంస్థకు సున్నంరాయి లీజు పొడిగింపు, అనంతపురం జిల్లా తుమ్మల గ్రామంలో క్వార్ట్స్ లీజు పొడిగింపు ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. అటవీ శాఖ మంత్రిగా శత్రుచర్ల విజయరామరాజు సచివాలయం డీబ్లాక్‌లో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డిసెంబరుతో గడువు ముగిసిన 471 మంది గ్రామీణ అటవీ అధికారులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 25 లక్షల ఎకరాల్లో రూ. 12 వేల కోట్ల ఉపాధిహామీ పనులు చేపట్టే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు.
సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డీకే అరుణ శుక్రవారం సచివాలయంలోని డీ బ్లాకులో పదవీ బాధ్యతలు చేపట్టారు. వృద్ధాప్యంతో విధి నిర్వహణకు దూరమైన జర్నలిస్టులకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ అందించే ఫైలుపై ఆమె తొలిసంతకం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థికసాయం చేసే మరో ఫైలుపై ఆమె రెండో సంతకం చేశారు. ఇక నుంచి తెలుగు రచనలో ప్రతిభ కనబరిచే వారికి నంది అవార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.












Click it and Unblock the Notifications