29వ తేదీననే శ్రీకృష్ణ కమిటీ నివేదిక: తెలంగాణపై ఎటూ తేల్చదా?

కమిటీ రెండో విధివిధానంలో "రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న వివిధ పరిణామాల ప్రభావం వివిధ ప్రాంతాల అభివృద్ధిపై ఏ మేరకు ఉందో సమీక్షించాలి" అని ఉంది. దీని ప్రకారం-1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న అంశాలను కమిటీ పూర్తిస్థాయిలో సమీక్షించవచ్చని ఎంపీలు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే-1972 నాటి జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ఆరు సూత్రాల పథకం, 610 జీవో అమలుపై కమిటీ సమగ్ర పరిశీలన చేసి నిజానిజాలను నిగ్గుతేలుస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి స్థాయి ఎంత, అందులో ప్రాంతీయ సమతౌల్యం ఎంత మేర ఉంది, అసమతౌల్య అభివృద్ధికి కారణాలేంటి, అందుకు పరిష్కార మార్గాలేంటి అన్న అంశాలపై కమిటీ తన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చని ఎంపీలు విశ్లేషిస్తున్నారు.
విధివిధానాల్లో పేర్కొన్న అంశాలతోపాటు ఇతర అంశాలపై సొంతంగా అభిప్రాయాలు వ్యక్తంచేసే స్వేచ్ఛ కమిటీకి కల్పించినందున గ్రేటర్ హైదరాబాద్, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాయల్ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ల సాధ్యాసాధ్యాలను నివేదికలో స్పృశించే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్య, ఉద్యోగాలు, విద్యుత్తు, సాగునీటి రంగాల్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందన్న తెలంగాణవాదుల విమర్శలన్నింటిపై కమిటీ సవివరంగా అభిప్రాయాలు వ్యక్తంచేస్తుందంటున్నారు. ఈ నాలుగు అంశాలపై ప్రత్యేక సలహాదారులను పెట్టుకొని అధ్యయనం చేయించిన కమిటీ భవిష్యత్తులో ఎవ్వరూ వేలెత్తి చూపని విధంగా వీటిపై పకడ్బందీ సూచనలు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications