ఏపీ వ్యవహారాలపై లోక్‌సభలో చర్చకు వైసీపీ పట్టు- నేరాల చిట్టా ఇదిగో: స్పీకర్ కు వాయిదా తీర్మానం
ఏపీలో శాంతిభద్రతల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై లోక్‌సభలో చర్చించాలని పట్టుబట్టింది. దీనిపై వాయిదా తీర్మానాన్ని సైతం స్పీకర్ కు అందజేసింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పెరిగిన నేరాలపై సభలో తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. పార్లమెంట్ లో చర్చకు వస్తే గానీ.. ఇక్కడి పరిస్థితులు యావత్ దేశానికి తెలియవని అభిప్రాయపడుతోంది.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు. నేటి సభ సాధారణ కార్యకలాపాలను పక్కనబెట్టి, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ శాంతిభద్రతల అంశంపై చర్చించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇటీవల పోలీసుల వేధింపుల కారణంగా కొందరు బలవన్మరణాలకు పాల్పడగా, మరికొందరు అనుమానాస్పద రీతిలో మరణించారని ఎంపీ గురుమూర్తి తన నోటీసులో పేర్కొన్నారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సాయికృష్ణ, నెల్లూరు జిల్లాలో ఏడుకొండలు లాకప్ డెత్‌కు గురైన ఘటనలను ప్రస్తావించారు ఇందులో. వీరితో పాటు కర్నూలుకు చెందిన మాల గంగమ్మ, కృష్ణా జిల్లాకే చెందిన క్రాంతి కుమార్, పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుస్సేన్ మృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దరియా హుస్సేన్ పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాయడాన్ని గుర్తు చేశారు.
2024 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏపీలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గణాంకాలతో సహా వివరించారు. ఈ 21 నెలల వ్యవధిలోనే మహిళలపై 209 నేరాలు జరిగాయని పేర్కోన్నారు. అందులో అత్యాచార కేసులు- 126, అత్యాచార యత్నాలు- 12, తీవ్రమైన లైంగిక వేధింపులు- 35 కేసులు ఉన్నాయని వివరించారు. దీనికి తోడుగా ఎస్సీ సామాజిక వర్గాలపై దాడులు, భూఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలు, సామాజిక బహిష్కరణలకు సంబంధించిన 69 దారుణ ఘటనలు వెలుగుచూశాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కూడా పరాకాష్టకు చేరాయని గురుమూర్తి విమర్శించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి 133 రాజకీయ హింసాత్మక ఘటనలు జరిగాయని, ఇందులో 49 మంది రాజకీయ ప్రత్యర్థుల హత్యలు జరిగాయని ఆరోపించారు. హత్యాయత్నాలు-6, కిడ్నాప్‌లు- 6 భౌతిక దాడులు- 58, ఆస్తుల ధ్వంసం- 10 కేసులు నమోదయ్యాయని అన్నారు. పోలీస్ శాఖ ఏకపక్ష పనితీరుపై హైకోర్టు ఇప్పటికే 12 సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలోని పాలనా వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.
ఏపీలో పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ రక్షణలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని గురుమూర్తి కోరారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి వ్యవస్థీకరించడానికి కేంద్ర హోంశాఖ ద్వారా సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పోలీసులపై, అధికార బలంతో దాడులు చేస్తున్న నిందితులపై నిష్పక్షపాతంగా, నిర్ణీత కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications