ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయమా?

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా వైయస్ జగన్ ను, చిరంజీవిని రెచ్చగొట్టే ప్రయత్నం తెలుగుదేశం వర్గాలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోతే ఈ ఇద్దరు నాయకులను రైతు వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి వీలవుతుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 70 మంది శాసనసభ్యుల బలం ఉంది. వైయస్ జగన్ వెంట దాదాపు 25 మంది దాకా కాంగ్రెసు శాసనసభ్యులు ఉన్నారు. ఇద్దరు ప్రజారాజ్యం శాసనసభ్యులు ఉన్నారు. మొత్తంగా జగన్ వెంట 30 దాకా శాసనసభ్యులుంటారని భావిస్తున్నారు. ప్రభుత్వం పడిపోతుందని భావిస్తే మరింత మంది జగన్ వైపు వచ్చే ఆవకాశాలున్నాయని భావిస్తున్నారు. వైయస్ జగన్, చిరంజీవి కలిసి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తెలుగుదేశం నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఓటింగుకు గైర్హాజరైనా కిరణ్ ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటున్నారు.
మజ్లీస్ ను తమకు అనుకూలంగా గత సంబంధాలను వాడుకుని తిప్పుకునే ఆలోచన కూడా చంద్రబాబు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరాస ఓటు వేసినా ఆశ్చర్యం లేదు. మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణలో తమ సత్తా చాటడానికి వీలువుతుందనేది తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆలోచిస్తున్నారు. ఎంత లేదన్నా తెలంగాణలోని 119 సీట్లలో తాము 70 సీట్లు గెలుచుకోగలమనే దీమాతో ఉన్నారు. మొత్తంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అస్థిరత్వంలో పడిపోయిందని చెప్పవచ్చు. చంద్రబాబు దీక్ష ముగిసిన తర్వాత పకడ్బందీ ప్రణాళిక రచించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications