రాష్ట్రంలో ఆగని రైతు మరణాలు: మరో 25 మంది మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని గంగంపాలెం గ్రామానికి చెందిన కౌలురైతు సోమిరెడ్డి రాములు(65) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. తాటిపర్తిలో కౌలు రైతు బస్సా సింగయ్య(38) గుండెపగిలి మృతిచెందాడు. దంగేరుకు చెందిన మర్రెడ్డి వెంకట్రావు(50) అనే కౌలు రైతు గుండెపోటుతో మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ఏడుగురు రైతులు మృత్యువాత పడ్డారు. పోలవరానికి చెందిన సోమరౌతు కనకారావు(60), కొయ్యలగూడెంలో పారేపల్లి వెంకన్న(65), భీమడోలుకు చెందిన చెన్నూరి రాఘవులు(65), నరసాపురానికి చెందిన కర్రి వీరరాఘవులు(60), మేడేవారిపేటకు చెందిన అభిమన్యుడు (65), తోకల పూడిపాలేనికి చెందిన వెంకటస్వామి (65), నాగన్న గూడానికి చెందిన కృష్ణ (45) మంగళవారం గుండెపోటుతో మరణించారు.
శ్రీకాకుళం జిల్లాలోని రాజపురం గ్రామానికి చెందిన గ్రామసేవకుడు, రైతు జామి అప్పన్న (60) పంట నష్టాన్ని జీర్ణించుకోలేక గుండె ఆగి మృతి చెందాడు. టెక్కలిలో కౌలు రైతు లట్టి నారాయణరావు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆయనను తెదేపా నేతలు పరామర్శించారు. కృష్ణా జిల్లాలో పంటనష్టంపై కలత చెంది కోడూరు తూర్పు ప్రాంతానికి చెందిన కౌలురైతు నరహరశెట్టి బాబూరావు(40) పురుగుమందు తాగి పొలంలోనే ప్రాణాలొదిలాడు. గుర్విందగుంటకి చెందిన కౌలురైతు పిట్టు వెంకటేశ్వర్లు(60) గుండెపగిలి మృతిచెందాడు. వెలగలేరు గ్రామానికి చెందిన మారుపెద్ది వెంకటేశ్వరరావు(55), వత్సవాయిలో నూకపోగు ఏసు (50), కొయ్యగూరపాడుకు చెందిన పెద మంగారావు (52) గుండెపోటుతో మరణించారు.
విశాఖపట్నం జిల్లాలోని దేవవరంలో కురందాసు అప్పారావు(58) అప్పుల బాధ తట్టుకోలేక పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు గ్రామానికి చెందిన రైతు దేవనబోయిన వెంకటేశ్వరరావు (48) పంటనష్టంపై కలత చెంది గుండెపోటుతో మృతి చెందాడు. ప్రకాశం జిల్లాలోని గంగపాలెం గ్రామానికి చెందిన కొమ్మాలపాటి కృష్ణమూర్తి(48) మనోవేదనతో మంగళవారం పొలంలోనేమృతి చెందాడు. ఖమ్మం జిల్లాలో తనికెళ్లకు చెందిన గడదాసు అప్పయ్య(50) అనే రైతు గుండెపోటుతో పొలంలోనే మృతిచెందాడు. జమ్మిగూడెంలో గొంతెన శ్రీను(42) పొగాకు తోట వద్దకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గోకవరం పంచాయతీ ఎర్రబంజర గ్రామానికి చెందిన మయారి లక్ష్మయ్య(33) పురుగు మందు తాగి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లాలోని మాదాపురానికి చెందిన రామావత్ గణేష్ ఆదివారం ఇంట్లోని క్రిమి సంహారక మందును తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. చెన్నకేశవాపురానికి చెందిన రైతు తుమ్మల వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కొమరబండ గ్రామంలో రెడ్డబోయిన చిన వెంకన్న(42) మనోవేదనకు గురై మృతి చెందాడు.












Click it and Unblock the Notifications