ఐసియులోకి మారేందుకు నిరాకరించిన చంద్రబాబు

కాగా, చంద్రబాబు గదినే ఐసియుగా మార్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు గదిలో రెండు ఇసిజి మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓ హార్ట్ మానిటరింగ్ సిస్టమ్ ను కూడా గదిలో పెడుతున్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
రైతు సమస్యలపై దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఎంపీలు స్వార్థం కోసం ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. రైతుల దగ్గరకు వెళ్లేందుకు ప్రభుత్వం గజగజ వణుకుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని మరో నేత నాగం జనార్థన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం ప్రతి నిమిషానికి క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని బాబుతో దీక్ష విరమింపజేసేందుకు ముఖ్య నేతలు, కుటుంబసభ్యులు ప్రయత్నించాలని కోరారు. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తమ అధినేత ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications