హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ ఉత్తుత్తదే: తెరాస అధినేత కె చంద్రశేఖరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై బ్రహ్మాండమైన నివేదిక ఇస్తుందన్నది ఒట్టి భ్రమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. కమిటీ ఇచ్చే నివేదిక ఉత్తుత్తిదే అని చెప్పారు. ఈ కమిటీకి తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను చెప్పాలన్న ఉద్దేశంతోనే వారికి తాము నివేదిక ఇచ్చామని, అంతేగాని, తెలంగాణ ఇచ్చేందుకు కమిటీ ఉపయోగపడదని తాము ఎప్పుడో చెప్పామన్నారు. రాష్ట్రం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రం తీసుకునే రాజకీయ నిర్ణయం మేరకే రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 23వ తేదీ తెలంగాణపాలిట ఓ దుర్దినం అని, ఆ రోజును జ్ఞాపకం చేసుకునేలా కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం 1969 ఉద్యమంలా ఒక్కసారిగా ఎగిసి కింద పడరాదని, సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని, తెలంగాణను ప్రకకటించే వరకు పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. మలిదశ పోరాటం జాగ్రత్తగా ఉండాలని, ప్రజల్లో నిరాశ కల్పించేలా ఐకాస నాయకులు మాట్లాడవద్దన్నారు. మొండి పట్టుదలతో ఉందామని, జార్ఖండ్‌ ప్రజలు 19 సంవత్సరాలపాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. ఉద్యమంలో కీలెరిగి వాతపెట్టాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలంటూ దీక్ష చేస్తామని, రాజీనామా చేస్తామని చెబుతున్నారని, గతంలో తెదేపా వారు కూడా డిసెంబర్‌ 31 తర్వాత రాజీనామాలు చేస్తామని చెప్పారని, వీటన్నింటినీ ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్దామని, వారిని నిలదీద్దామన్నారు. ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే, మూడంచల్లో నాయకత్వ వ్యవస్థ ఉంటుందని, ఒకరిని అరెస్టు చేస్తే మరో అంచె రంగంలోకి దిగుతుందని, ఐకాస ఆ మేరకు ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతోపాటు ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాల్సిందేనన్నారు. లేకపోతే ప్రపంచంలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమం ఉంటుందని, ఎవరూ ఊహించని విధంగా ఉద్యమిస్తామని, గాంధీ చెప్పిన మార్గంలో సహాయ నిరాకరణ చేస్తామని, తెలంగాణలో చీమ, దోమ కూడా కదలకుండా చేస్తామని హెచ్చరించారు. అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుందని, ఒకవైపు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు తెలంగాణలో సహాయ నిరాకరణ ప్రారంభమవుతుందన్నారు. ఉద్యమం చేపట్టడంపై పకద్బందీ వ్యూహం ఉందని, ముందు ముందు అనేక మలుపులు ఉంటాయని చెప్పారు. తెలంగాణలోని అన్ని సంఘాలు, పార్టీలు ఐకాస కిందనే పనిచేయాలని, ఉద్యమం పేరుతో ఆదుర్ధా పడవద్దన్నారు. ప్రధాన ఐకాసలో చర్చించకుండా విద్యార్థి సంఘాలుగానీ, ఇతర సంఘాలు కానీ బంద్‌ పిలుపులు ఇవ్వరాదని కేసీఆర్‌ చెప్పారు. మంచి సమన్వయంతో కల్సి పనిచేద్దామని, గతంలో తలెత్తిన లోపాలను సవరించుకుందామన్నారు. ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ఎవరినీ బొట్టుపెట్టి పిలవబోమని, కాంగ్రెస్‌, తెదేపాలు కలిసి వస్తారో...లేక కాలగర్భంలో కలిసి పోతారో నిర్ణయించుకోవాలని చెప్పారు. ఐకాసలోకి తెదేపాను ఆహ్వానించాలంటూ వివిధ సంఘాలు తెచ్చిన ప్రతిపాదన విడ్డూరంగా ఉందని, ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని అలాంటి వారితో ఎలా వెళ్తామని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ గడువు ఈనెల 31తో ముగుస్తుండటంతో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకు విశ్రమించకూడదని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాలు తీర్మానించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం అనుసరించాల్సిన వ్యూహం, చేయాల్సిన కార్యక్రమాలను రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస ఆదివారమిక్కడ ప్రకటించింది. ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ ఐకాస విస్తృతస్థాయి సమావేశం స్థానిక ఏవీ కళాశాలలో నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఐకాస అనుబంధ సంఘాలన్నీ దీనికి హాజరయ్యాయి. భాజపా తరఫున మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్‌రావు, పార్టీనేత వనం ఝాన్సీ, సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ నేతలు సూర్యం, గోవర్ధన్‌, టీఎన్జీవో నేత స్వామిగౌడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగుల సంఘం నేయాకులు విఠల్‌, దుర్గాబాయి, పీవోడబ్ల్యూ నేత సంధ్య, ఉపాధ్యాయ సంఘం నాయకులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌, లెక్చరర్ల ఫోరం నేత కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో అదనంగా పోలీసు బలగాలను మోహరించడాన్ని తప్పుపట్టారు. ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిందని, ప్రధానమంత్రి, రక్షణ, హోంమంత్రులు ఏడాదిపాటు తమకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారని కేసీఆర్‌ చెప్పారు. ఏడాదిపాటు తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమానం..అదనపు బలగాలా అని ప్రశ్నించారు. ఎవరిని చంపడానికి వీరిని పంపుతున్నారని నిలదీశారు. ఇక్కడి ప్రజలను చంపడానికి పోలీసు బలగాలను ప్రభుత్వం రప్పిస్తుంటే... తెలంగాణలో ఉన్న అధికార పార్టీ, కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేయలేరా అని అడిగారు. ఎంత మంది ప్రజలను అరెస్టు చేస్తారు? ఎంత మందిని పోలీసులతో చంపిస్తారంటూ ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసు బలగాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మోహరించి ఉద్యమాన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఉస్మానియా విద్యార్థులు మండలాలకు తరలాలని, ప్రతీ పల్లె ఉద్యమానికి సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారిని ముందస్తు అరెస్టులు చేస్తే తెలంగాణ భగ్గుమంటుందన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీలు ముందస్తు అరెస్టుల పేరుతో చేతులుకాల్చుకోకూడదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా హింస ఉండదని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X