కాంగ్రెసు ఎంపీల దీక్ష: వైయస్ జగన్, చంద్రబాబు టార్గెట్

రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై వైయస్ జగన్ 48 గంటల లక్ష్యదీక్ష చేపట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే, నారా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష కూడా చర్చనీయాంశంగానే మారింది. ఈ ఇద్దరు నాయకుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదో మేరకు ఇరకాటంలో పడింది. పరిస్థితిలో మార్పు రాకపోతే వారి ప్రభావం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. ఈ స్థితిలో ప్రజల దృష్టిని మళ్లించడానికి విద్యార్థుల కేసుల ఎత్తివేత అంశాన్ని తీసుకుని కాంగ్రెసు పార్టీ రాజకీయం నడిపినట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పటికే తెలంగాణలో అడుగు పెట్టలేని వాతావరణం ఉంది. మెల్లమెల్లగా చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా ఆయన నల్లగొండ జిల్లాలో పర్యటించారు. వైయస్ జగన్ కూడా తెలంగాణలో అవకాశం దొరికితే కాలు మోపడానికి కాచుకుని ఉన్నారు. ఈ ఇద్దరు నాయకుల ప్రభావం తెలంగాణలో ఏ మాత్రం లేకుండా చూడడానికి కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేసి తన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.
పైగా, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయించిన ప్రతిష్ట కూడా కాంగ్రెసు వారికే దక్కుతుంది. దానివల్ల, తమకు ప్రజల సమస్యలు పట్టవని అపవాదు నుంచి బయట పడడానికి కూడా బాగా పనికి వచ్చిందని అంటున్నారు. దాదాపు రెండు రోజుల పాటు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చేసిన దీక్ష, వారి దీక్ష విరమింపజేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ప్రధాన వార్తాంశాలుగా మారాయి. దీంతో రైతు సమస్యలపై చంద్రబాబు, జగన్ చేస్తున్న పోరాటాలు, విమర్శలు ఏదో మేరకు పక్కదారి పట్టినట్లే.












Click it and Unblock the Notifications