రాజీనామాలకు సిద్ధం కండి: రాజకీయ నేతలకు కెసిఆర్ పిలుపు

రాజకీయ నాయకులంతా త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. చరిత్ర తెలంగాణ నాయకులకు ఓ గీత గీసిందని, ప్రజల వైపు ఉంటారా లేదా అనేది తేల్చుకోవాలని, ప్రజల వైపు ఉంటే త్యాగధనులు అవుతారని, లేదంటే చరిత్ర హీనులవుతారని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టకపోతే రాజీనామాలకు సిద్ధపడాలని ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులను కోరారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, లేకపోతే అత్యున్నతమైన పార్లమెంటు మీద ప్రజలకు విశ్వాసం పోతుందని, తిమ్మిని బమ్మిని చేస్తామంటే కుదరదని, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుందని ఆయన అన్నారు. రాజకీయ జెఎసి చేసే తీర్మానాలే తమ తీర్మానాలని ఆయన అన్నారు.
జెఎసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేద్దామని ఆయన పార్టీ కార్యవర్గ సమావేశంలో నేతలకు పిలుపునిచ్చారు. మానసికంగా ఉద్యమానికి సిద్ధపడాలని ఆయన సూచించారు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చునని, ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలను కూడా ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతిమ విజయం సాధిస్తామని, అంత వరకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications