విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, వైయస్సార్‌ లపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై, దివంగత నేత వైయస్సార్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. మన దేశంపై దండెత్తి వచ్చిన గజనీలు కేవలం బంగారాన్ని, డబ్బునే దోచుకు పోయారని కాని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం చివరకు భూమిలో ఉన్న ఖనిజాలను కూడా దోచుకున్నారని ఆయన మంగళవారం కృష్ణా జిల్లాలో కైకలూరు పర్యటనలో విమర్శించారు. వైయస్ తన హయాంలో కొల్లేరు ప్రాంతంలో 7500 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. వైయస్ తీవ్ర అవినీతికి పాల్పడితే కొడుకు జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఢిల్లీలో దీక్ష చేయకుండా అవినీతికి పాల్పడిన వైయస్ సమాధి వద్ద చేయాలని జగన్‌కు సూచించారు.

అక్రమంగా స్వాధీనం చేస్కున్న పేదల భూములను వారికి ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ వారి తరఫున పోరాడుతుందన్నారు. రైతులకు ధైర్యం చెప్పడానికి, కష్టాలు తెలుసుకోవడానికే తాను వచ్చనన్నారు. పేదలపై ప్రభుత్వం ఆటలు సాగనివ్వమన్నారు. సమాజంలో అవినీతి పెరిగితే సమస్యలు వస్తాయన్నారు. పేదల పేదలుగానే ఉండిపోవడానికి పెద్దలు మాత్రం మరింత ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణం అవినీతి అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డికి వైయస్ అక్రమంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాన్ని కట్టబెట్టారని, ఆ ధనంతో ఆయన ఎంపీలను, ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.

రోడ్లు వేయించుకున్నది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదని, ప్రయాణం చేయడానికి అని జగన్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వైయస్ విగ్రహాలనుద్దేశించి అన్నారు. 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందన్నారు. కాని పేదలను ఆదుకోవడానికి మాత్రం వెనుకాడుతుందన్నారు. పేదల అభివృద్ధికి పాల్పడింది ఒక్క తెలుగుదేశం పార్టీయే నన్నారు. కొల్లేరు మత్స్యకారులను న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. వైయస్ ఆపరేషన్ కొల్లేరు తర్వాత 40 శాతం మందికి పైగా మత్స్యకారులు వలస వెళ్లి దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు.

కొల్లేరు రైతుల న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, కొల్లేరు మత్స్యకారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు కారణంగా కైకలూరుకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేవేగౌడకు అలమట్టి కట్టవద్దని తాను చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దళితులకు, బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X