హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య కేసు: బయటపడుతున్న సినీ, రాజకీయ లింక్ లీలలు

By Pratap
|
Google Oneindia TeluguNews

C Kalyan and Bhanu
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యతో రాష్ట్ర రాజకీయ, తెలుగు సినీ రంగాల డొంక కదులుతోంది. సూరిని అతని నమ్మినబంటు భాను కిరణ్ హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్న స్థితిలో రాజకీయ, సినీ రంగాల పెద్దల పేర్లు వెలికి వస్తున్నాయి. హైదరాబాదు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలా కాలంగా భూదందాలు, సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిల్, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయనేది సూరి హత్య జరిగేంత వరకు ప్రచారం మాత్రమే. ఆ ప్రచారం ఇప్పుడు వాస్తవాల రూపంలో బయటపడుతున్నాయి.

రాజకీయాలు, సినీ రంగాలు మిలాఖతైన వైనం కూడా గత కొద్ది కాలంగా చూడవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. కానీ సూరి హత్య జరిగిన తర్వాత మాఫియా సంబంధాలు బయటపడుతున్నాయి.

పులివెందుల ముఠాలు హైదరాబాదులో సెటిల్మెంట్లు చేస్తున్నాయని, భూకబ్జాలకు పాల్పడుతున్నాయని దివంగత నేత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సభలోనే అప్పట్లో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ఆరోపించారు. దాన్ని ఎవరూ అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు సూరి హత్యతో డొంక కదులుతోంది.

రాజకీయ వైరుధ్యాలు కూడా భూదందాలు, సెటిల్మెంట్లు బయటపడడానికి దోహదం చేస్తున్నాయి. సూరి హత్య వెనకనే కాకుండా మస్తాన్ రావు అనే రియల్టర్ ఆత్మహత్య వెనక వైయస్ జగన్ హస్తంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, స్టూడియోఎన్ టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. వైయస్సార్ కుటుంబ సభ్యులు భాను కిరణ్ దందాల్లో ఉన్నారని వైయస్ తోడల్లుడు మల్లికార్జున రెడ్డి ఉదంతాన్ని చూపుతూ వేలెత్తి చూపుతున్నాయి.

కాగా, తెలుగు సినీరంగంలో కొద్ది మంది నిర్మాతలపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. కానీ, వాటిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. మాస్ హీరోలతో భారీ బడ్డెట్‌లతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవరూ అడిగిన పాపాన పోలేదు. అయితే, భాను కిరణ్‌కు చెందిన 43 ఆస్తులు సినీ నిర్మాత సి. కళ్యాణ్ పేర ఉన్నట్లు పోలీసులు కనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూరి పేరు మీద కళ్యాణ్‌ సహకారంతో భాను సెటిల్మెంట్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాత శింగనమల రమేష్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, నిర్మాతగా మారిన హాస్యనటుడు గణేష్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.

సూరి పేరు మీద భాను కిరణ్, మంగలి కృష్ణ, శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తులు భూదందాలు చేసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నింటికీ జగన్‌తో లింక్ కలిపే ప్రయత్నం చేస్తోంది. మస్తాన్ రావు ఆత్మహత్య కేసులో జగన్‌ను రికార్డు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్‌ను అనవసరంగా ఇరికిస్తున్నారని, తనను కూడా అనవసరంగా లాగుతున్నారని, ఓ కుట్ర జరుగుతోందని శ్రీకాంత్ గౌడ్ అంటున్నారు. మొత్తం మీద, రియల్ ఎస్టేట్ బూమ్‌కు దందాలకు, సెటిల్మెంట్లకు సంబంధం ఉందనే విషయం మాత్రం అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X