నెల్లూరులో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ భూకబ్జా?: వార్తాకథనం

C Kalyan
నెల్లూరు: నెల్లూరులో సినీ నిర్మాత సి. కళ్యాణ్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ నెల్లూరు నడిబొడ్డునున్న 59 సెంట్ల స్థలాన్ని తన సహచరుడితో కలిసి సొంతం చేసుకున్నారని ఆ పత్రిక ఆరోపించింది. వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆర్కాట్ నవాబు వారసులంటూ కొంతమందిని తీసుకొచ్చి, వారివద్ద రూ. 1.10 కోట్లకు కొన్నట్లు చూపించి కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆ వార్తాకథనం ప్రధాన ఆరోపణ. నెల్లూరు నడిబొడ్డున ఒకటిన్నర ఎకరాల వక్ఫ్‌భూమి ఉంది. ఈ భూమిని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆర్కాట్ నవాబు ముస్లింల శ్మశానవాటిక కోసం ఇచ్చారు. ఇందులో కొంతభాగంలో ముస్లింల సమాధులు, దర్గాలు ఉండగా మరో 59 సెంట్ల భూమి (354 అంకణాలు) ఖాళీగా ఉంది.

ఆ వార్తాకథనం ప్రకారం - ఆర్కాట్ నవాబు వారసులు అంటూ నెల్లూరు, తంజావూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన కొంతమందిని తీసుకొచ్చి, కళ్యాణ్ వారితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి విలువ రూ. 1,10,45,000 అని చెప్పి ఆ మేరకు తన ప్రతినిధి మెంటా మల్లికార్జునరావుతో 2008 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయించారు. ఇదే మొట్టమొదటి డాక్యుమెంట్ కావడంతోను, వివాదం ఉండటం వల్ల అప్పటి రిజిస్ట్రార్ ఈ భూమి రిజిస్టర్ చేయడానికి నిరాకరించి దాన్ని సస్పెన్షన్‌లో పెట్టారు. ఇదే సమయంలో స్థానిక మహిళా ప్రజాప్రతినిధి ఈ భూమిలో 150 అంకణాలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కానీ అప్పట్లో బేరం కుదరలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ఈ ప్రాంతంలో అంకణం 4 లక్షలు. అంటే.. మొత్తం భూమి విలువ సుమారు రూ. 14 కోట్లు! దీంతో కళ్యాణ్ అండ్ కో ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి పత్రాలు విడుదల చేయించుకున్నారు.

నెల్లూరుకు చెందిన ముస్లిం పెద్దలు మాత్రం ఈ వ్యవహారంపై నాటి నుంచి నేటివరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు. తమకు శ్మశాన స్థలం కూడా లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇది కచ్చితంగా వక్ఫ్ ఆస్తేనని, అన్యాయంగా కళ్యాణ్ తదితరులు దీన్ని సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ మైనార్టీసెల్ నేత ఆసిఫ్ బాషా ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తే విలువైన భూమి వక్ఫ్‌బోర్డుకు చెందుతుందని ఆయన అన్నారు.

తెలుగు సినీపరిశ్రమలో భాను కిరణ్ పెట్టుబడులు పెట్టాడన్న విషయమై సి.కళ్యాణ్ ‌ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు స్థలం విషయంలో కూడా భాను గ్యాంగు ప్రమేయం ఉందేమోనని ఇక్కడివారు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+