హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసులో చిచ్చు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi and Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో పొత్తు అంశం కాంగ్రెసు పార్టీలో చిచ్చు పెట్టింది. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయంపై కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం సమర్థిస్తోంది. ఇరు వర్గాల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ చర్చను మలుపు తిప్పారు. చిరంజీవితో పొత్తు అంశం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో కూడా విభేదాలు సృష్టించింది. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే కాంగ్రెసు అధిష్టానం ప్రతిపాదనపై వైయస్ జగన్ వర్గం నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెసులోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం.

రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని, ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకోవడాన్ని కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి తప్పు పడుతూ సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోనియా నాయకత్వాన్నే వెంకటస్వామి వ్యతిరేకించారు. సోనియా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆంటోనీ వంటి నేత చిరంజీవి ఇంటికి వెళ్లడాన్ని ఆయన సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.

కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి చిరంజీవితో కాంగ్రెసు పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యవాది చిరంజీవితో కాంగ్రెసు పొత్తుకు సిద్ధపడడమేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్, మంత్రి బస్వరాజు సారయ్య, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ తమ కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించారు. తెలంగాణకు, ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకు మధ్య సంబంధం లేదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

కాగా, కాకా విమర్శలతో స్వయంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి కాకాను తప్పు పట్టారు. వి. హనుమంతరావు కాకాను ఉతికి ఆరేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వెంకటస్వామి విమర్సలను వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాకాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద, చిరంజీవితో పొత్తు ప్రతిపాదన కాంగ్రెసులో తీవ్ర దుమారాన్నే రేపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X