• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాంగ్రెసులో పార్టీ విలీనానికి రెడీ, రక్షణలపైనే చిరంజీవి మల్లగుల్లాలు

By Pratap
|
Google Oneindia TeluguNews
Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చారు. అయితే, విలీనం చేస్తే తమకు ఏ విధమైన రక్షణలు కల్పిస్తారనే విషయంపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. తనకే కాకుండా తన పార్టీ సీనియర్ నాయకులకు, ప్రస్తుత శాసనసభ్యులకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఏ విధమైన హామీలు ఇస్తుందనే విషయంపైనే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టారు. తమ పార్టీకి చెందిన 90 శాతం మంది విలీనం వైపే మొగ్గు చూపుతున్నారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు అనడాన్ని బట్టి దాని గురించి ఇక పెద్దగా సందేహం గానీ, ముందు వెనకలు గానీ లేవని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చిరంజీవి ఆదివారం సాయంత్రం గాని, సోమవారం ఉదయం గానీ కలిసే అవకాశాలున్నాయి. విలీనం ప్రక్రియ ఎలాగుండాలి, తనతోపాటు పార్టీలో చేరిన వారి ప్రయోజనాల్ని ఎలా కాపాడాలి, మంత్రివర్గంలో ఏ మేరకు ప్రాధాన్యమివ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత ప్రరాపా క్యాడర్‌కి ఇవ్వాల్సిన అవకాశాలు, 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు సీనియర్‌ నేతలకు టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందనే అంశాలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని అంటున్నారు. వీటి గురించి చర్చిస్తే బాగుంటుందని ఇప్పటికే పరోక్షంగా పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధ్యక్షుడు చిరంజీవికి సూచించారు. కొందరు శాసనసభ్యులు సైతం ఈ విషయంలో కాస్త గట్టిగా ఉండాలనే అగ్ర నాయకత్వానికి చెబుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఉండటం, వారు చిరకాలంగా అక్కడి పార్టీపై గట్టిపట్టు కలిగి ఉండటం దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలోని రెండు సెగ్మెంట్లతో పాటు నిర్మల్‌ వంటి మరికొన్ని చోట్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్త వచ్చన్న భావన ఇప్పటికే శాసనసభ్యుల్ని కలవర పరుస్తోంది.

ఇప్పటివరకు వ్యక్తమైన అభిప్రాయాల మేరకు విలీన ప్రక్రియ పూర్తయిన మూడు నెలల తరువాతే మంత్రివర్గంలో చేరటం, ఇతర పదవులు చేపట్టటం వంటి అంశాలు ఉంటాయని సమాచారం. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా కేంద్ర మంత్రివర్గంలో చేరటమే మేలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ అంశం సైతం సోనియాతో జరిగే చర్చల్లో ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో సంబంధాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని చిరంజీవికి అప్పగిస్తూ తీర్మానాలు చేసి పంపాలని నాయకులు జిల్లా కమిటీలకు సూచించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు, నియోజక వర్గాల్లో ఇలాంటి సమావేశాలు జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ తాజాగా సమావేశం నిర్వహించి తీర్మానాన్ని రాష్ట్ర కమిటీకి పంపింది.

చిరంజీవి కొంతమంది సీనియర్‌ నేతలతో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. అదే రోజు సాయంత్రంగాని సోమవారం ఉదయంగాని సోనియాగాంధీతో సమావేశమవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఆయన తిరిగి వచ్చాక అందులో చర్చించిన అంశాలు, కాంగ్రెస్‌ ప్రతిపాదనలపై రెండు, మూడు రోజుల వ్యవధిలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. విలీనం ఖరారైతే... ఆ పక్రియ వేగంగానే సాగిపోతుందని, కొద్ది వారాల్లోనే మొత్తం పూర్తి కావచ్చని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X