టీవీకేలో భారీగా చేరికలు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో టీవీకే కండువా కప్పుకొన్నారు. వీరిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వారి అనుచరులు ఉన్నారు. వీరి రాకతో తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలపై టీవీకే పట్టు సాధించినట్టయింది. ఈ ఉదయం వారందరూ కూడా చెన్నైలోని టీవీకే కేంద్ర కార్యాలయంలో మంత్రి బస్సీ ఎన్ ఆనంద్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, విలావంకోడ్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ విజయధరణి బీజేపీని వీడారు. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకేలో చేరారు. చెన్నై పనైయార్‌లో గల టీవీకే ప్రధాన కార్యాలయంలో ఆమె వందలాది అనుచరులతో టీవీకే కండువా కప్పుకొన్నారు.

టీవీకే ప్రధాన కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మంత్రి బస్సీ ఎన్ ఆనంద్ సమక్షంలో విజయధరణి అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయధరణి బీజేపీ నుంచి దూరమవ్వడం ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ను వదిలి ఆమె ఢిల్లీలో బీజేపీలో చేరారామె. చేరి రెండేళ్లకు పైగా గడిచినా పార్టీ నిర్మాణంలో ఆమెకు ఎలాంటి కీలక బాధ్యత దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో ఆమె బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విలావంకోడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓడిపోయారు. త్రిముఖ పోటీలో ఆమెకు మొత్తం 45,604 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ ప్రవీణ్ విజయం సాధించారు. టీవీకే తరఫున పోటీ చేసిన మైకేల్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. అంతకుముందు విజయధరణి 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విలావంకోడ్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు.
విజయధరణి చేరికతో టీవీకేకు విలావంకోడ్ సహా దక్షిణ తమిళనాడులోనూ రాజకీయంగా లబ్ది కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి ఇది స్పష్టమైన నష్టంగా మారింది. వరుసగా మూడు సార్లు గెలిచిన నాయకురాలు పార్టీని వీడటం, రాష్ట్రంలో కూటములపై, అభ్యర్థుల ఎంపికపై, రాబోయే పోటీపై ప్రభావం చూపే అంశంగా కనిపిస్తోంది.
మరోవంక ఏఐఏడీఎంకే సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కేటీ పచ్చమ్మాళ్ కూడా టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, అనుచరులు టీవీకే పార్టీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత క్యాబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు పచ్చమ్మాళ్. వీరితో పాటు తిరువణ్ణామలై నియోజకవర్గ మాజీ ఎంపీ ఆర్ వనరోజా, ఏఐఏడీఎంకే చెన్నై వెస్ట్ జోన్ మాజీ కార్యదర్శి ఎన్ బాలగంగ వంటి ప్రముఖులు కూడా పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications