వైయస్ జగన్‌పై మరోసారి దండెత్తిన రామోజీ రావు ఈనాడు డైలీ

"ఒక దొంగ కంపెనీని సృష్టించడం ద్వారా మొత్తం 4,098 గజాల విస్తీర్ణం కల రెండు విల్లా స్థలాలను వై.ఎస్.జగన్మోహనరెడ్డి కొట్టేశారు. ఇందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ రెండు స్థలాల విలువ కనీసం రూ.20.49 కోట్లు ఉంటుందని అంచనా. విశేషమేమంటే వీటి కోసం రికార్డు ప్రకారం నామమాత్రంగా చెల్లించాల్సిన రూ.2.1 కోట్లను సైతం జగన్ తన చేతి నుంచి పెట్టలేదు. ఆ ఖర్చును వైఎస్ ప్రభుత్వం నుంచి భూమి పొందిన ఒక కార్పొరేట్ లబ్ధిదారుడి ఖాతాలో వేసి.. అతనితోనే కట్టించేసినట్టు ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది" అని ఈనాడు ఆరోపించింది.
"వైఎస్ సర్కారులో సలహాదారుడి అవతారమెత్తి కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతుంటే.. ఆయన వియ్యంకుడు ఎమ్మార్‌లో భారీగా దందా నడిపించినట్టు స్పష్టమవుతోంది. అడ్వాన్సు అడక్కుండానే.. ఎటువంటి చెల్లింపులూ లేకుండానే ఎమ్మార్‌లో ఒక విల్లాను కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు కె.రఘుకు కేటాయించినట్లు బయటపడింది. రఘు కుటుంబానికి మొత్తం నాలుగు విల్లా స్థలాలు, మరో నిర్మాణం పూర్తయిన విల్లా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు భార్య పేరుతో మరో విల్లా స్థలం ఉంది" అని ఈనాడు వివరించింది.
సాక్షాత్తూ విజిలెన్స్ అంచనాల ప్రకారం.. ఎమ్మార్ విల్లాల విక్రయంలో జరిగిన లూటీ దాదాపు రూ.817 కోట్లు!! ఎంతలేదన్నా గజం రూ.50 వేల పలికే విల్లా స్థలాలను గజం రూ.5 వేలకు అమ్మినట్లు రికార్డులలో చూపి.. మిగిలిన రూ.45 వేలను అనధికారికంగా ఢిల్లీలో వసూలు చేసినట్టు బయటపడటం కీలకమైన అంశమని ఈనాడు వ్యాఖ్యానించింది. ఈ లూటీ ఎలా జరిగిందనే విషయాన్ని కూడా ఈనాడు సవివరంగా చెప్పింది.