చిరంజీవి హస్తగతం, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో విలీనం

జనవరి 31న సోనియాగాంధీ తన దూతగా రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీని హైదరాబాద్‌కు పంపి చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడంతోనే విలీనం ఖాయమన్న విషయం రూఢీ అయింది. ఆ పరిణామం తర్వాత చిరంజీవి తన పార్టీ శ్రేణులతో జరిపిన చర్చల్లో కూడా విలీనం ప్రతిపాదనకు పూర్తి స్థాయి మద్దతు లభించడంతో అది లాంఛనమైంది. దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అధికారాన్ని తనకే కట్టబెడుతూ పార్టీ చేసిన తీర్మానాధికారంతో ఢిల్లీలో అడుగుపెట్టిన చిరంజీవి సోనియాతో సమావేశం ముగిసిన వెంటనే విలీన ప్రకటన చేశారు. సోనియాగాంధీని కలవడానికి ముందు చిరంజీవి ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లి ముప్పావు గంట సమావేశమయ్యారు.
మీకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, విశేషమైన స్థాయి గల ఆంటోనీని మీ కోసమే హైదరాబాదుకు పంపడాన్ని బట్టి మీకు ఎంత ప్రధాన్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని అహ్మద్ పటేల్ చిరంజీవితో చెప్పినట్లు తెలిసింది. దీంతో విలీనానికి చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. విలీనానికి తమ పార్టీ కూడా పూర్తి మద్దతు పలుకుతున్నందున వెంటనే ప్రకటన చేయడానికీ తమకేమీ అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. అహ్మద్ పటేల్‌తో సమావేశం తర్వాత చిరంజీవి, సి.రామచంద్రయ్యలు ఒకే కారులో సోనియా నివాసానికి వచ్చారు. అంతకు ముందే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ అక్కడికి చేరుకున్నారు.
సాయంత్రం 3.59 నిమిషాల నుంచి 4.39 గంటల వరకు జరిగిన సమావేశంలో అయిదుగురూ కలిసి కూర్చొని వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. తొలుత ఉభయుల యోగక్షేమాల గురించి, తర్వాత రాష్ట్ర అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పే అంశాలను సోనియాగాంధీ చాలా ఆసక్తిగా విన్నట్లు సమాచారం. ఆయనపట్ల పూర్తి సానుకూల దృక్పథం కనబరుస్తూ వివిధ అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. సమావేశానంతరం వీరప్ప మొయిలీ, చిరంజీవి, సి.రామచంద్రయ్యలు ఉమ్మడిగా మీడియా ముందుకొచ్చి పార్టీ విలీనం ప్రకటన చేశారు. విలేకర్లు ప్రశ్నలు వేయక ముందే చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేస్తున్నట్లు ప్రకటించారు. మొయిలీ కూడా చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇక నుంచి ఆయన అన్నీ తానై కాంగ్రెస్‌ను నడిపిస్తారని చెప్పారు.