ఇక కెసిఆర్‌కు సోనియా గాంధీ గాలం, తెలంగాణపై దృష్టి

ఇక, తెలంగాణ ప్రాంత సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంది. తెలంగాణలో బలమైన నాయకుడిగా అవతరించిన కెసిఆర్‌ను తమ వైపు తిప్పుకోగలిగితే సమస్య పరిష్కారమవుతుందనే భావనతో సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, అహ్మద్ పటేల్ మంగళవారం సాయంత్రం సోనియా గాంధీని కలిశారు. వీరిద్దరు తెలంగాణ అంశంపైనే సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ కమిటీపై మలి విడత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే తేదీని సోనియా ఖరారు చేసే అవకాశం ఉంది. కెసిఆర్ నాయకత్వంలోని తెరాసను విలీనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారా, కొన్ని నెలల పాటు రాజ్యాంగ రక్షణలు కల్పించి, అది పని చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనే హామీ ఇస్తారా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడితే తప్ప అంగీకరించబోమని కెసిఆర్ అంటున్నారు.
బిల్లు ప్రతిపాదనకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల నుంచి, పార్లమెంటు సభ్యుల నుంచి కూడా అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడికి కాంగ్రెసు అధిష్టానం తలొగ్గుతుందా అనే సందేహం కూడా కలుగుతోంది. కెసిఆర్ బలహీనమైన క్షణంలో కాంగ్రెసు అధిష్టానం హామీకి తలొగ్గుతారా అనే అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా, చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఒకదాన్ని తగ్గించగలిగింది. తెలంగాణ కోసం తన పార్టీలో ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉంది.
అప్పుడు తెలుగుదేశం కూడా ఏదో ఒక అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తారని తాజాగా రాష్ట్ర మంత్రి పి. శంకర రావు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద, తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసి, చంద్రబాబును బలహీన పరచడానికి అనువైన పాచికనే కాంగ్రెసు అధిష్టానం వేస్తోందని అంటున్నారు.
తెలంగాణ ఇస్తే కెసిఆర్ కాంగ్రెసులోకి వస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అంటున్నారు. ఆయన తరుచుగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలుస్తున్నారు. తెలంగాణ ఇచ్చి తెరాసను కాంగ్రెసులో విలీనం చేసుకోవాలని, తెలంగాణ ఇస్తే తెరాస విలీనమవుతుందని ఆయన నచ్చజెప్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇదే ఆశిస్తున్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని, తగినన్ని పార్లమెంటు సీట్లు వస్తాయని వారు వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications