తెలంగాణపై అసెంబ్లీలో నిర్దిష్టమైన చర్చ జరగాలి: జయప్రకాష్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణపై శాసనసభలో నిర్దిష్టమైన చర్చ జరగాలని లోకస్తత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. వాస్తవాల ఆధారంగా నిజాయితీతో తెలంగాణపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై నిర్దిష్టమైన చర్చ చట్టసభల్లో జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య ఏనుగులా నిలుచుని ఉంటే సమస్యే లేదనే పద్ధతిలో వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు బాగానే ఉంటున్నారని, ప్రజలే తెలంగాణ ఉద్యమం వల్ల నష్టపోతున్నారని, అది కొనసాగడం మంచిది కాదని ఆయన అన్నారు. చట్టసభల్లో చర్చ జరగపోతే, చట్ట సభల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే వీధుల్లో తన్నుకోవడం ద్వారా, ఘర్షణ పడడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణపై యథాతథ స్థితి కొనసాగడం మంచిది కాదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలుగా విభజిద్దామా, మూడు రాష్ట్రాలుగా విభజిద్దామా అనేది నిర్దిష్టంగా, నిజాయితీతో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని ఆయన అన్నారు. సమస్యను ఇదే పద్ధతిలో కొనసాగించడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని, రాష్ట్రం పతనమవుతుందని ఆయన అన్నారు. తానేది మాట్లాడినా భూతద్దంలో చూసి శల్యపరీక్ష చేస్తున్నారని, అందుకు తనకేమీ బాధ లేదని ఆయన అన్నారు. తాను భయంతోనో, మనకెందుకులే అనో వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు.
లాంఛనప్రాయంగా సభ జరగడం సరి కాదని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని, ఇది మంచి పరిణామం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కరించడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కావాలంటే అందరినీ ఒప్పించడానికి ప్రయత్నం జరగాలని, ఇంకో రకంగా సాధ్యం కాదని ఆయన అన్నారు. సామరస్యవూర్వకంగా, చట్టబద్దంగా చర్చకు అసెంబ్లీ తప్ప మరో వేదిక లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అందుకు ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం కావాలని ఆయన అన్నారు.
Loksatta president Jayaprakash Narayana demanded debate in Assembly on Telangana issue. He said that Telangana issue should be solved amicably, if not it will be dangerous to the state.
Story first published: Monday, February 21, 2011, 13:32 [IST]