ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో సీమాంధ్ర నేతల భేటీ జరిగేనా?
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా హైదరాబాద్‌లోని కావూరి ఇంట్లో జరగాల్సిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం జరిగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. తెలంగాణవాదుల వ్యూహానికి ప్రతివ్యూహం చేసే ఉద్దేశ్యంతో ఈనెల 5వ తారీఖున కావూరి ఇంట్లో భేటీ కావడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నిశ్చయించుకున్నారు. అయితే తెలంగాణ లాయర్లు కావూరి ఇంటిని ముట్టడించడం, ఆ తర్వాత ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తడం దృష్ట్యా తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచు పడ్డారు. కావూరి ఇంట్లో భేటీ నిర్వహించకూడదని ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలే కావూరిని హెచ్చరించారు.
అంతేకాదు, లాయర్ల ముట్టడి అనంతరం విలేకరులతో మాట్లాడిన కావూరి తన ఇంట్లో భేటీ జరుగుతున్నట్టు ఎవరో చెబితే సరిపోతుందా నేను చెప్పానా అని విలేకరులను ప్రశ్నించారు. ఆ మాటలను బట్టే ఆయన తన ఇంట్లో భేటీకి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా భేటీ వద్దని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించి మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా కావూరి మార్చి 5న తన ఇంట్లో భేటీ ఏర్పరిచే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీలోగానీ, మరే ఇతర ప్రాంతంలోగానీ వారు తమ సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉంది.