వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సోనియా గాంధీ వ్యూహం ఏమిటి, డైలమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యూహం ఏమిటి, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది తెలియడం లేదు. తెలంగాణ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. అయితే, అది అంత త్వరగా పరిష్కరించే విషయం కాదని ఇంతకు ముందు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన వల్ల తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని బుట్టదాఖలు చేసేందుకు, లేదంటే దానిపై మరింత కాలయాపన చేసేందుకు మాత్రమే కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ సమస్యను రాత్రికి రాత్రి పరిష్కరించలేమని చిదంబరం చెప్పారు. దీనిపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ విధంగా అనడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

కాగా, తాము శ్రీకృష్ణ కమిటీ ఆరో ప్రత్యామ్నాయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు. అంటే, తెలంగాణకు చట్టబద్దమైన గ్యారంటీలను ఇస్తూ రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలనేది వారి అభిప్రాయం. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు అందుకు సిద్ధంగా లేరు. గ్యారంటీలన్నీ పనికి రాని కాగితాలయ్యాయని, తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి వద్దని అంటున్నారు. తమ డిమాండుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యారు. తెరాస సభ్యులను చూస్తే వారు వరుసగా లోకసభ సమావేశాలను అడ్డుకోవడానికే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. లోకసభ గురువారం వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. తెరాస సభ్యులకు ఎన్‌డిఎ సభ్యులు మద్దతుగా నిలిచారు.

రాష్ట్రంలో కూడా పరిస్థితి సజావుగా లేదు. ఉద్యోగుల సహాయ నిరాకరణ, తెలంగాణ శాసనసభ్యుల అసెంబ్లీ బహిష్కరణ, ప్రజా ఉద్యమాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా సీమాంధ్ర నాయకులు మాత్రం తెలంగాణ ఇవ్వకూడదని పట్టుబడుతున్నాయి. ఈ స్థితిలో తెలంగాణపై చర్చించేందుకు కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమవుతోంది. తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఇతర కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు రాత్రి 9 గంటల సమావేశంలో వివరించే అవకాశాలున్నాయి. దాని వల్ల ఏమైనా పరిష్కారం లభిస్తుందా అనేది సందేహమే. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యులు శాంతించినా తెరాస సభ్యులు ఎన్‌డిఎ సభ్యులతో కలిసి సభను అడ్డుకునే అవకాశాలే ఉన్నాయి.

తెలంగాణ సమస్య అత్యంత సున్నితమైంది, సంక్లిష్టమైందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని, దశలవారీగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు మీడియా వ్యవహరించకూడదని ఆయన సలహా ఇచ్చారు. అభిషేక్ మను సింఘ్వీ మాటలను బట్టి తెలంగాణపై కాలయాపనకే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం రచిస్తోందని అర్థమవుతోంది.

English summary
Telangana issue became headache to Congress president Sonia Gandhi. It is felt that it is not easy to her take decision on Telangana issue. Congress core committe is going to meet to discuss on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X