వైయస్ వివేకానంద రెడ్డి అభ్యర్థిత్వంపై తేల్చని కాంగ్రెసు అధిష్టానం

శాసనసభ్యుల కోటా నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని శాసనమండలికి పంపిస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, కడప జిల్లాకు చెందిన చెంగల్రాయుడిని పోటీకి దించుతుండడంతో అదే జిల్లాకు చెందిన వైయస్ వివేకానంద రెడ్డిని కూడా దించుతారా అనేది అనుమానంగా ఉంది. అయితే, పులివెందుల శానససభ నియోజకవర్గం నుంచి వైయస్ వివేకానంద రెడ్డి పోటీకి దిగడం ఖాయమని తేలిపోయింది. అయితే, అక్కడి విజయంపై నమ్మకం పెట్టుకోకుండా వివేకాను మండలికి పంపాలని అధిష్టానం ఆలోచించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో గవర్నర్ కోటాలో కూడా వివేకానంద రెడ్డిని శాసనమండలికి పంపే అవకాశం ఉంది.
కాంగ్రెసు ఐదో అభ్యర్థిని కూడా రంగంలోకి దింపుతుందా, లేదా అనేది తేలడం లేదు. అలా దింపితే పోటీ అనివార్యంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ మూడు సీట్లను తనకున్న బలంతో గెలుచుకునే అవకాశం ఉంది. మరో అభ్యర్థిని దింపే సాహసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేయకపోవచ్చు. ఈ పరిస్థితిని అర్థం చేసుకునే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు కాంగ్రెసుకు సహకరిస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ పరిస్థితిలో కాంగ్రెసు అధిష్టానం ఐదో అభ్యర్థిని దింపకపోవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.