హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల బూచీ, ప్రణబ్ ముఖర్జీ మంత్రాంగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం మరో ఎత్తు వేసింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను చూపి తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ అంశంపై దృష్టి పెడతామని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం రాష్ట్రాల శాసనసభలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మేలో ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో తాము మునిగి ఉన్నందున తెలంగాణ అంశంపై దృష్టి పెట్టలేమని ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ప్రణబ్ ఇదే విషయం చెప్పారని, తాను ఫోన్ చేస్తే కూడా ప్రణబ్ ముఖర్జీ అదే విషయం చెప్పారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి చెప్పారు.

మేలో మాత్రమే తెలంగాణపై దృష్టి పెడతామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పడం బాధ్యతారహితమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. తాము అంత కాలం ఆగబోమని ఆయన చెప్పారు. దీన్ని బట్టి కూడా తెలంగాణపై కాలయాపనకు ఐదు రాష్ట్రాల ఎన్నికలను అడ్డుపెట్టుకుందనేది అర్థమవుతోంది. ఆలాగే, తెలంగాణపై మేలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర చేనేత మంత్రి పి. శంకరరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 2014 నాటికి తెలంగాణ రావడం ఖాయమని ఆయన అన్నారు. దీన్నిబట్టి కాలయాపనకు తెలంగాణ రాజకీయ నాయకులను పార్టీ అధిష్టానం సిద్ధం చేసినట్లుగానే భావించాలి.

కాగా, ఈ నెల 10వ తేదీన జరిగే మిలియన్ మార్చ్ టు హైదరాబాదు కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సిద్ధమవుతున్నారు. తాను ప్రత్యక్షంగా ఇందులో పాల్గొంటానని మధు యాష్కీ చెప్పారు. ఇతర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని చెప్పినందున తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే ఇతర పార్టీలు లాభపడే ప్రమాదం ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శనివారం కరీంనగర్‌లో అన్నారు. సీమాంధ్రవాళ్లది కడుపు నిండిన మాట, తమది కడుపు మండుతున్న మాట అని ఆయన వ్యాఖ్యనించారు. ఏమైనా, తమ పార్టీ అధిష్టానం చెప్పిన మాటకు తలొగ్గుతూనే ఒత్తిడికి అవసరమైన కార్యక్రమాలు కొనసాగించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

English summary
Congress high command is using five states assembly election to postpone Telangana issue. It is clear that Congress high command will not take up Telangana issue till May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X