సహాయ నిరాకరణ వాయిదా, తెలంగాణ ఉద్యోగులకు హామీ

మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు- ఆనం రామనారాయణరెడ్డి, దామోదర రాజనర్సింహ, డి.నాగేందర్, ఎన్.రఘువీరారెడ్డి, ముఖేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్‌తో తొలుత తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలు చర్చలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి వద్ద సుదీర్ఘ చర్చలు జరిగాయి. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సహాయ నిరాకరణ విరమించాలని ఉద్యోగ నేతల్ని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ప్రభుత్వానికి, ఉద్యోగ నేతలకు మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంపై ప్రభుత్వాధికారులు, ఐకాస నేతలు సంతకాలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేర్చడానికి తెలంగాణ రాజకీయ ఐకాస తీసుకునే అన్ని నిర్ణయాలు, ఆందోళనల్లో తాము భాగస్వాములు అవుతామని, 10వ తేదీ జరగనున్న మిలియన్ మార్చ్‌లో పాల్గొంటామని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు ప్రకటించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే విషయంపై చర్చించడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా కలిపించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులతోపాటు 610 జీఓ ఉల్లంఘనల పరిశీలన బాధ్యతను కూడా న్యాయ కమిషన్‌కు నివేదిస్తామని సీఎం చెప్పారన్నారు. 'వర్క్ టు రూల్' పాటిస్తామని, లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించినా, మోసపూరితంగా వ్యవహరించినా ఎలాంటి ఆందోళనకైనా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు.