చిరంజీవి సమస్యలే వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తే ఆ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు. దాంతో తెలంగాణ అంశం తన పార్టీకి అడ్డుపడదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దాంతో మార్చి 8వ తేదీన ప్రారంభించాల్సిన తన పార్టీని ఏప్రిల్‌కు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఆదరణ తగ్గే అవకాశాలు ఉండడం, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండని వాతావరణం వల్ల ఆయన తెలంగాణపై వైఖరిని ప్రకటించాల్సిన అవసరం లేని సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కూడా జగన్ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. జగన్ తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా వర్గీకరణకు అనుకూలంగానే వ్యవహరించారు. కానీ అది అమలు కాలేదు, కోర్టులో దానికి బ్రేకులు పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చట్టసవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) పోరాటం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు జగన్‌కు ఉన్నట్లు లేదు. ఆయన వర్గంలోని ప్రధాన నాయకుడు జూపూడి ప్రభాకర రావు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మందకృష్ణ మాదిగను, వర్గీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమానికి మాలలు చేస్తున్న పోరాటానికి జూపూడి ప్రభాకర రావు నాయకత్వం వహిస్తున్నారు. దీనివల్ల మాదిగలు జగన్‌కు దగ్గరవుతారా అనేది సందేహంగానే ఉంది.
కానీ, వైయస్ జగన్ తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారి పార్టీని స్థాపించిన తర్వాత ఇతర పార్టీల వ్యూహంలో భాగంగా కూడా జగన్ ఆ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏమైనా, జగన్ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభం కాకపోవచ్చు.