చంద్రబాబు ట్రిక్కు: తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల్లో విభేదాలు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: పార్టీ ఊపందకుంటున్న తెలంగాణవాదాన్ని దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పన్నిన పథకం వల్ల పార్టీ తెలంగాణ శాసనసభ్యుల్లో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అంశంపై దూకుడుగా వ్యవహరిస్తున్న నాగం జనార్దన్ రెడ్డిని దెబ్బ తీయడానికి ఆయన తెలంగాణకు చెందిన కొంత మంది శాసనసభ్యులను ఉసిగొల్పారనే అభిప్రాయం ఉంది. దానివల్ల నాగం జనార్దన్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి వంటి తెలంగాణ శాసనసభ్యులు విరుచుకుపడ్డారు. కొత్తకోట దయాకర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిపై యుద్ధమే ప్రకటించారు. నాగం జనార్దన్ రెడ్డి కన్వీనర్‌గా ఉన్న పార్టీ తెలంగాణ ఫోరంలో పనిచేయబోనని మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు.
తెలంగాణ ఫోరం పనిచేసే అవకాశాలు లేవని గ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి కన్వీనర్‌గా ఉండబోనని ప్రకటించి, పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోరానికి ఎవరు నాయకత్వం వహించాలనేది సమస్యగా మారింది. అసలు, ఫోరం ఉండాలా, లేదా అనేది కూడా వారు నిర్ణయించుకోలేకపోతున్నారు. అయితే, తెలంగాణలో క్యాడర్ పార్టీ నుంచి వీడిపోకుండా చూసుకోవడానికి ఏదో రూపంలో తెలంగాణ ఉద్యమంలో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, అది ఎలా అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. పార్టీ తెలంగాణ శాసనసభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి మాత్రం తన పద్ధతిలో తాను ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రజల్లో తన పలుకుబడి తగ్గకుండా ఆయన చూసుకుంటున్నారు.
Differences cropped up among TDP Telangana region MLAs due to the strategy adapted by party president N Chandrababu Naidu. TDP Telangana MLAs are in dilemma in participating Telangana movement.
Story first published: Saturday, March 12, 2011, 16:54 [IST]