జెసి దివాకర్ రెడ్డి షాక్: అనంతపురంలో టిడిపి అభ్యర్థి గెలుపు
Districts
oi-Pratapreddy
By Pratap
|
అనంతపురం: తమ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో షాక్ ఇచ్చాడు. దీంతో ఆయన పరాజయం పాలు కాక తప్పలేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి 59 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు శైలజానాథ్, రఘువీరా రెడ్డిలకు వ్యతిరేకంగా జెసి దివాకర్ రెడ్డి వర్గం పనిచేయడంతో కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓడిపోక తప్పలేదు.
తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి వర్గం అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరిపినా జెసి దివాకర్ రెడ్డి వినలేదు. మెట్టు గోవింద రెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. 8 జిల్లాల్లోని 9 ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది.