నీతి ఉంటే రాజీనామా చేయండి : జగన్ వర్గం ఎమ్మెల్యేకు చంద్రబాబు సవాల్

సిగ్గులేని సాక్షి తనపై ఇష్టారాజ్యాంగా వార్తలు రాస్తుందన్నారు. దివంగత వైయస్ తనపై 22 విచారణలు ఏర్పాటు చేసి నిరూపణ చేయలేక ఉపసంహరించుకున్నారని అన్నారు. అవసరమైతే తనపై వంద కమిటీలు వేసుకోవచ్చునని సవాల్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పతనం చేసిన వ్యక్తులు నా గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. అవినీతిపరులను ప్రోత్సహించకూడదన్నారు. అవినీతిపరులను మట్టుబెట్టాలంటే ప్రత్యేక చట్టం తీసుకు రావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి రాష్ట్రంలో జరిగిందని అదే మనకు చాలా దురదృష్టమన్నారు. నాదర్‌గుల్ భూములను తాకట్టు పెట్టి ప్రభుత్వాధినేతల సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్నారు.
హవాలా ద్వారా అవినీతి సొమ్మును రాష్ట్రానికి రప్పించి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. హసన్ అలీని అరెస్టు చేయాలని ఆరునెలలుగా తానే డిమాండ్ చేస్తున్నానని అన్నారు. అవినీతిపరులు జైళ్లో ఉండవలసిన వారు కానీ బయట తిరగవలసిన వారు కాదన్నారు. ఒక పార్టీనుండి గెలిచిన వారు మరొకరికి ఓటు వేయడం చాలా దారుణమన్నారు. అభ్యర్థులు నీతి నిజాయితీలు మరిచి సంతలో పశువుల మాదిరిగా ఇతరులకు అమ్ముడు పోతున్నారన్నారు. నోటుకు అమ్ముడు పోకుండా ఓ చట్టం తీసుకు రావాలని కోరారు.
రాష్ట్రంలో మైనింగ్ పేరుతో భూములను దక్కించుకున్న గాలి జనార్ధన్ రెడ్డి కోటీశ్వరుడయ్యారన్నారు. అవినీతిపరుల వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందన్నారు. ఓబుళాపురం మైనింగ్ కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.