వైయస్ జగన్ బహిరంగ లేఖ: చంద్రబాబు, రామోజీ రావులపై నిప్పులు

తన ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంత డ్రామా నడపాలా అనీ ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఇంత నీచానికి దిగజారిపోవాలా అనీ ఆయన ప్రశ్నించారు. తను ఎదుర్కోవడానికి అన్నీ పక్షాలూ ఒక్కటై పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పపడ్డాయని, కుట్ర చేశాయని ఆయన విమర్శించారు. ఢిల్లీ నుంచే తనపై కుట్ర నడుస్తోందని ఆయన అన్నారు. తాను సోనియా గాంధీని ఎదిరించిన తర్వాతనే 2008 - 09 సంవత్సరానికి సంబంధించి సాక్షి పెట్టుబడులపై తనకు నోటీసులు వచ్చాయని ఆయన చెప్పారు.
మార్గదర్శి వ్యవహారంలో రామోజీ రావుకు నోటీసులు రాలేదా, వాటిని ఖాతరు చేశారా, కనీసం డిపాజిటర్ల పేర్లయినా వెల్లడించారా అని ఆయన అడిగారు. లోతు తెలియకుండానే దూకేసే జయప్రకాష్ నారాయణ గానీ, ఈనాడు లేకపోతే బతుకు లేదనుకునే చంద్రబాబు నాయుడు గానీ వాటి గురించి ఏ ఒక్క రోజైనా ప్రశ్నించారా అని ఆయన అడిగారు. రామోజీరావుకు సంబంధించినవైతే మీకు మాటలు రావా, మాట్లాడలేరా అని ఆయన ప్రశ్నించారు.