పవన్ కల్యాణ్ తీన్‌మార్ పోస్టర్లపై గుడ్లు, టమోటాలు: ఫ్లెక్సీలు ధ్వంసం
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీన్‌మార్ చిత్రంపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై విద్యార్థులు తమ ఆగ్రహాన్ని చూపించారు. తీన్‌మార్ పోస్టర్లపై విద్యార్థలు గుడ్లు, టమోటాలు విసిరారు. కూడలిలో భారీగా ఉన్న ఫ్లక్సీలను చించివేసి వాటిని దగ్థం చేశారు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీన్‌మార్ చిత్రం టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ స్థాపించి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటంతో తెలంగాణ విద్యార్థులు పవన్ కల్యాణ్ చిత్రాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూపిస్తున్నారు.
కాగా గతంలో కూడా పవన్ కల్యాణ్ చిత్రాలపై పలుమార్లు దుమారం రేగింది. పవన్ పులి చిత్రం విడుదలయినప్పుడు టైటిల్‌పై తీవ్ర వివాదం చెలరేగింది. టైటిల్‌లోని కొమురం పేరును తొలగించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు నిర్మాత, హీరో తలొంచక తప్పలేదు. ఆ తర్వాత తీన్‌మార్ అనేతి తెలంగాణకు సంబంధించిన పేరని, పవన్ కల్యాణ్ తీన్‌మార్‌ను కించపరిచేలా ఆ పేరును పెట్టుకున్నారని వరంగల్ జిల్లాకు చెందిన తీన్‌మార్ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ఆరోపించారు. తీన్‌మార్ పేరును తొలగించాలని అప్పుడు డిమాండ్ చేశారు. తాజాకా ఓయు విద్యార్థులు తీన్‌మార్ చిత్రం టైటిల్‌పై మరోసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.