హైదరాబాద్: ఇంటిలోనే చితి పేర్చి తల్లిదండ్రుల మృతదేహాలను ఓ కుమారుడు కాల్చడానికి ప్రయత్నించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. మృతదేహాలను ఇంట్లో దహనం చేసేందుకు కుమారుడు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని కుమారుడే హతమార్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడి ప్రమేయం ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విశ్రాంత న్యాయమూర్తి హన్మంతరావు(80) కుటుంబం 16 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని బండ్లగూడ అభ్యుదయనగర్‌లో స్థిరపడింది. ఆయనతో పాటు భార్య సరోజిని(75), చిన్న కుమారుడు నర్సింహరాజు (40) ఉండేవారు. 15 ఏళ్ల క్రితం నర్సింహరాజును భార్య వదిలి వెళ్లింది. అతడు అప్పుడప్పుడూ మతిస్థిమితం తప్పి పిచ్చివాడిలా ప్రవర్తించేవాడని, ఒంటరిగా గదిలోనే ఉండేవాడని స్థానికులు చెప్పారు.
బుధవారం సాయంత్రం తండ్రి హన్మంతరావు, తల్లి సరోజిని మృతదేహాలపై ఇంటి ఆవరణలోనే కట్టెలు పేర్చి నిప్పుపెట్టేందుకు నర్సింహరాజు యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి నర్సింహరాజును అదుపులో తీసుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. సరోజిని మృతదేహం కుళ్లిపోయింది. ఆమె మూడు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని, హన్మంతరావు 48 గంటల క్రితం ఉరివేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో మనస్తాపంతో అతను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని నర్సింహరాజు పోలీసులతో చెప్పాడు. భార్య వదిలి వెళ్లినప్పటి నుంచి నివాసం నుంచి బయటకురాని నర్సింహరాజు ఇంట్లోనే తల్లిదండ్రుల అంత్యక్రియలు చేద్దామని భావించి ఉంటాడని రాజేంద్రనగర్ ఏసీపీ సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
A son tried to cremate his parents dead bodies in his house in Hyderabad. Dead bodies of retired judge Hanumanth Rao and his wife found in suspicious circumstances.
Story first published: Thursday, April 7, 2011, 8:20 [IST]