న్యూఢిల్లీ: భారతదేశం మరో విజయం సాధించింది. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే వెనక నిలబడి భారత ప్రజానీకం ఘన విజయం సాధించింది. దీంతో అన్నా హజారే 90 గంటల పాటు సాగించిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం ఉదయం విరమించుకున్నారు. తన డిమాండ్లపై ప్రభుత్వం శుక్రవారం రాత్రి దిగి రావడంతో అన్నా హజారే తన దీక్షను విరించారు. జన్ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కేంద్రమంత్రి కపిల్ సిబల్ స్వామి సంయుక్త కమిటీ ఏర్పాటుకు కేంద్రం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రతిని స్వామి అగ్నివేశ్‌కు అందచేశారు.
జీవో జారీ చేసినందుకు హజారే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా శిబిరం వద్ద సామాజిక కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేటు వద్ద విజయోత్సవ వేడుకలలో పాల్గొనాలని హజారే పిలుపునిచ్చారు. తనతో పాటు దీక్ష చేపట్టిన మద్దతుదారులకు అన్నా హజారే నిమ్మరసం ఇచ్చి దీక్ష ను విరమించచేశారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, అవినీతిని రూపుమాపాలన్నదే తమ అంతిమ లక్ష్యమని హజారే అన్నారు. అవినీతి అంతానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఆగస్టు 15లోగా లోక్‌పాల్ బిల్లు అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హజారే హెచ్చరించారు. ఇది ప్రజలందరి విజయంగా ఆయన అభివర్ణించారు.
జన్ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనకు వేసే కమిటీకి ప్రణబ్ ముఖర్జీ కో చైర్మన్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్, ఎకె ఆంటోనీ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి.