కడప లోకసభ ఉప ఎన్నిక ఏకపక్షమా, త్రిముఖమా?

వైయస్ జగన్‌ను ఓడించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెసు తరఫున చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార రంగంలోకి దిగారు. ఒక రకంగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో హోరాహోరీ పోరుకు సిద్ధపడ్డాయి. సంప్రదాయ కాంగ్రెసు ఓట్లు వైయస్ జగన్‌కు, డిఎల్ రవీంద్రా రెడ్డికి మధ్య చీలిపోయి తాము లాభపడుతామని తెలుగుదేశం అంచనా వేస్తోంది. దానికి తోడు, వైయస్ జగన్ కోటాలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కాగా, కాంగ్రెసు పార్టీ మంత్రులను కూడా రంగంలోకి దించి, విజయం కోసం అన్ని ప్రయత్నాలూ సాగిస్తోంది. తమ ఓట్లకు గండి పడకుండా చూసుకోవడమే కాకుండా సాధ్యమైనంత వరకు వైయస్ రాజశేఖర రెడ్డి సంప్రదాయ ఓట్లను కూడా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఉంది. ఆ కారణంగానే వైయస్ జగన్‌పై కాంగ్రెసు నాయకులు మాటల ఈటెలతో చుట్టుముట్టి విమర్శలు సంధిస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తమవాడేనని ప్రకటించుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే కడప ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి.