• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు వెన్నుపోటుకు జూ.ఎన్టీఆర్ కూడా భయపడ్డాడు: కెటిఆర్

By Srinivas
|

KT Rama Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా భయపడే మహానాడు కార్యక్రమానికి రాలేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. చంద్రబాబును కుటుంబ సభ్యులే నమ్మడం లేదని ఇక కార్యకర్తలు, ప్రజలు ఎలా నమ్మగలరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై నమ్మకం లేకే హరికృష్ణ మహానాడు కార్యక్రమంలో మధ్యలోనే అలిగి వెళ్లారని అన్నారు. చంద్రబాబు మొదటి నుండి వెన్నుపోటు దారుడే అని ఆయన ఆరోపించారు. 1979లో కాంగ్రెసు పార్టీలో మంత్రిగా ఉంటూ అధికార పార్టీకి చెందిన అభ్యర్థినే ఓడించడానికి ప్రయత్నాలు చేసినప్పటి నుండి నేటి వరకు చంద్రబాబు నిత్యం అందరినీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆరోపించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అన్నారు.

ఇటీవల 2009 సాధారణ ఎన్నికలలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలంగాణకు శాసనపరంగా ముందుకు వెళతామని చెప్పి కేంద్రం తెలంగాణ ప్రకటించిన మరుసటి రోజే చంద్రబాబు వెనక్కి వెళ్లారని ఆరోపించారు. డిసెంబర్ 9న ప్రకటన తర్వాత సీమాంధ్ర నేతల రాజకీయ పరంపరలకు టిడిపి పార్టీయే నిలయమైందన్నారు. తెలంగాణ టిడిపి నాయకులు చంద్రబాబు తీరును ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. టిడిపితో తెలంగాణ అసాధ్యమన్నారు. తెలంగాణ కోసం టిడిపితో కలిసి వెళ్లడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం వంటిదే అన్నారు. తాను మాట్లాడితేనే న్యాయం అన్న చంద్రబాబు తెలంగాణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్ కాకుండా సీమాంధ్రకు చెందిన ఎర్రన్నాయుడు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వరరావులచే చంద్రబాబు తెలంగాణకు అనుకూల ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు మద్దతు పలకనంత వరకు టిడిపి అంటే తెలంగాణ ప్రజలకు తెగిన చెప్పుతో సమానం అన్నారు.

తన అసమర్థత కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు మహానాడులో టిఆర్ఎస్, చంద్రశేఖరరావులపై ఆరోపణలు చేశారన్నారు. కెసిఆర్‌ను వసూల్ రాజా అన్న చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. నారావారిపల్లెలో 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబునాయుడు ఇరవై వేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగాడాని ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తెహెల్కా పత్రికలో చంద్రబాబు దేశంలోని అత్యంత ధనవంతమైన రాజకీయ నాయకుడిగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుకు అక్రమ ఆస్తులు లేకుంటే తరుచూ డ్రైవర్‌కు, పార్టీ ముఖ్య నేతలకు కూడా తెలియకుండా విదేశీ పర్యటనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు అంత పనికి మాలిన ప్రతిపక్ష నాయకుడు లేడన్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే శీతాకాల సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెడితే మేం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు తెలంగాణ సంస్కృతి కూడా తెలియదన్నారు. తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులకు తెలంగాణ కావాలా, చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకులు కావాలా నిర్ణయించుకోవాలని సూచించారు. ఉద్యమం చేతకాకుంటే ఇంట్లో పడుకొండి. కానీ ఉద్యమం చేస్తున్న వారిని మాత్రం విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాము గూర్ఖాలాండ్‌కు వ్యతిరేకమని కెటిఆర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతి భద్రతాపరంగానే తాము గూర్ఖాలండ్ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెలంగాణపై మమతా బెనర్జీ ఇంత వరకు ఏమీ మాట్లాడలేదని ఆమె మాట్లాడిన తర్వాత స్పందిస్తామని చెప్పారు.

English summary
TRS MLA K Taraka Rama Rao fired at TDP president Chandrababu Naidu today. He said Jr.NTR was absent to mahanadu because he is afraid of Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X