చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం సాధ్యం కాదా?

జగ్జీవన్‌రాం వర్సెస్ నిజలింగప్ప:1969లో కాంగ్రెస్ పార్టీ మొట్ట మొదటిసారి రెండుగా చీలిపోయింది. డాక్టర్ జాకీర్‌హుస్సేన్ మృతి తరువాత.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పార్టీలో విభేదాలు పొడచూపాయి. సి.సుబ్రమణ్యం, ఆ తరువాత జగ్జీవన్‌రామ్ అధ్యక్షతలోని కాంగ్రెస్(జే) ఇందిరాగాంధీకి మద్దతివ్వగా.. నిజలింగప్ప నేతృత్వంలో మరోవర్గం తయారైంది. ఈ వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. దాంతో చట్టసభలకు ఎన్నికైన సభ్యుల పరంగా, పార్టీ సభ్యత్వం పరంగా మెజారిటీ నిరూపించుకోవాలని ఈసీ రెండు వర్గాలను కోరింది.
ఆ పరీక్షలో కొన్ని రాష్ట్రాల్లో జగ్జీవన్‌రాం వర్గానికి, గుజరాత్, మైసూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో నిజలింగప్ప వర్గానికి మెజారిటీ ఉన్నట్లు తేలింది. చివరకు, జగ్జీవన్‌రాం వర్గానిదే అసలైన పార్టీ అని ఈసీ తేల్చింది. దాంతో నిజలింగప్ప వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 'కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ పరంగా దేశమంతా విస్తరించింది. మెజారిటీ నిరూపించుకోమనే పరీక్ష సరైనదే. అయితే, పార్టీ విసృ్తతి దృష్ట్యా.. ప్రాథమిక సభ్యుల మద్దతు ఎటువైపు ఉందో పరీక్షించడం ఈసీకి సాధ్యం కాదు. అందువల్ల ఈసీ నిర్ణయం సరైనదే అని భావిస్తున్నాం" అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
లోక్‌దళ్+ జనతాపార్టీ= జనతాదళ్: ఈ తీర్పును అనుసరించే జనతాదళ్ విలీనం అంశాన్ని ఎన్నికల సంఘం పరిష్కరించింది. లోక్‌దళ్, జనతాపార్టీలకు చెందిన కొందరు ముఖ్యమైన నేతలు వ్యక్తిగత నిర్ణయం తీసుకుని 1988లో జనతాదళ్ పార్టీని ఏర్పర్చారు. ఆ రెండు పార్టీలను లాంఛనంగా విలీనం చేయలేదు. దాంతో లోక్‌దళ్, జనతా పార్టీలు కూడా ప్రత్యేక పార్టీలుగా కొనసాగుతాయని ఈసీ ప్రకటించింది.
అండమాన్, నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ 'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్)" 1999 జూలైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లో విలీనమైంది. ఆ విలీనం సమయంలో ఎన్‌సీపీ ఈసీ వద్ద కనీసం రిజిస్టరై కూడా లేదు. రాజకీయ పార్టీగా రిజిస్టరైన తరువాత ఎన్‌సీపీ.. అండమాన్, నికోబార్ దీవుల్లో ప్రాంతీయ పార్టీగా తమను గుర్తించాలని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) గుర్తై చర్ఖాను తమకు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, ఆ పార్టీకి అధికారిక గుర్తుంపును ప్రకటించిన ఈసీ, చర్ఖా గుర్తును మాత్రం కేటాయించలేదు.
ఎన్‌సీపీలో విలీనమైనపుడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, అందువల్ల పాత గుర్తై చర్ఖాను ఎన్‌సీపీకి కేటాయించలేమని స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. పీఆర్‌పీలోని కొందరు నాయకులు కానీ, పార్టీ సభ్యులు కానీ విలీనాన్ని వ్యతిరేకిస్తే.. విలీనాన్ని ఈసీ ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ. అంతగా అయితే, చిరంజీవి వర్గం కాంగ్రెస్‌లో చేరొచ్చు. అయితే, ఒక పార్టీగా పీఆర్‌పీ కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ హోదా కూడా దానికి ఉంటుంది.
'ఆల్‌పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్‌ఎల్‌సీ) వర్సెస్ కెప్టెన్ సంగ్మా అండ్ అదర్స్" కేసు సందర్భంగా సుప్రీంకోర్టు 'మరో పార్టీలో విలీనం కావడం అంటే మరణశాసనం లిఖించుకోవడమే" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'అలాంటి సందర్భాల్లో విలీనానికి సంబంధించి కొద్దిమంది సభ్యుల నిర్ణయం కాకుండా ప్రాథమిక సభ్యులందరి ఆమోదం తప్పనిసరి" అని పేర్కొంది. ఆ కేసు వివరాల్లోకి వెళితే.. ఏపీహెచ్‌ఎల్‌సీ అనే మేఘాలయకు చెందిన గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం చెందాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఆ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో తీసుకున్నారు. 121 మంది ప్రతినిధుల్లో ఆ సదస్సుకు హాజరైన 81 మంది ఆ నిర్ణయాన్ని ఆమోదించారు.
మెజారిటీ రూల్‌ను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోలేమని, మొత్తం పార్టీపై ప్రభావం చూపే ఇలాంటి నిర్ణయాల్లో ప్రాథమిక సభ్యుల నుంచి స్పష్టమైన తీర్పు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'కెప్టెన్ సంగ్మా నేతృత్వంలోని అత్యధికులు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, కొందరు నేతలు ఏపీహెచ్‌ఎల్‌సీ జెండా, గుర్తుతో పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నందున.. సింబల్స్ ఆర్డర్‌లోని నిబంధనలు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసేందుకు అంగీకరించవు. అందువల్ల ఏపీహెచ్‌ఎల్‌సీ పాత గుర్తుతో, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుంది" అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రాథమిక సభ్యుల ఆమోదంతోనే విలీన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. విలీనాలకు సంబంధించిన తదనంతర కేసుల్లో ఈ తీర్పునే పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications