మళ్లీ సెలవులు, స్కూల్స్ రీఓపెనింగ్ కొత్త డేట్ ఇదే!
రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెనింగ్) తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది. విద్యాసంబంధిత క్యాలెండర్ ప్రకారం వాస్తవానికి ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ తేదీని మార్చుతూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం.. పాఠశాలలు ఈ నెల 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని వాయిదా వేయడం వెనుక బలమైన కారణం ఉంది. ఈ నెల 12న స్కూళ్లు తెరిచినప్పటికీ.. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సాధారణ సెలవులు వచ్చాయి. స్కూల్ తెరిచిన మరుసటి రోజే వరుస సెలవులు రావడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 12వ తేదీకి బదులుగా నేరుగా సోమవారం (ఈ నెల 15న) నుంచే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడమే ఉత్తమమని భావించి వాయిదా వేసింది.

జులై 11న వర్కింగ్ డే.. జూన్ నెలాఖరులో మరికొన్ని సెలవులు
ఈ నెలలో కోల్పోయిన ఒక పనిదినాన్ని భర్తీ చేసేందుకు వీలుగా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఈ రెండో శనివారానికి (జూన్ 13) బదులుగా, వచ్చే నెల అంటే జులై 11న వచ్చే రెండో శనివారాన్ని పాఠశాలలకు వర్కింగ్ డేగా (పనిదినం) పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, జూన్ నెలలోనే విద్యార్థులకు మరికొన్ని సెలవులు కూడా కలిసిరానున్నాయి. స్కూళ్లు తెరిచిన తర్వాత వచ్చే జూన్ 21 మళ్లీ సాధారణ ఆదివారం కాగా.. ఆ తర్వాత జూన్ 26న మొహర్రం పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. తాజా నిర్ణయంతో విద్యార్థులకు వేసవి సెలవులు మరో మూడు రోజులు అదనంగా దొరికినట్లయింది.














Click it and Unblock the Notifications