వైయస్ జగన్‌కు సవాల్, ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం

విశ్వాస తీర్మానం ప్రతిపాదించి నెగ్గితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలదొక్కుకుంటారని, ముఖ్యమంత్రి ప్రతిష్ట పెరుగుతుందని, కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం దక్కకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తాము కాంగ్రెసుతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవడానికే కాకుండా వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులకు సవాల్ విసిరినట్లుగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అనుకున్నారు.
కాగా, స్పీకర్ పదవికి పోటీ పెట్టాలా అనే విషయంపై కూడా చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు. అయితే, స్పీకర్ పదవికి అభ్యర్థిని పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గానీ మద్దతు ఇవ్వకపోవచ్చునని, అందువల్ల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఆ రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన ఎంత మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనేది ఓ సవాల్ అవుతుందని, వారు కాంగ్రెసు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే జగన్ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నారని విమర్సించి ఇరకాటంలో పెట్టడానికి వీలవుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.