రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్ని వణికిస్తున్నాయి. ముడి చమురు, గ్యాస్, విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ప్రపంచదేశాలతోపాటు భారత్ కు కీలకమైన సముద్ర రవాణా మార్గం ఇదే. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 నుంచి 65 శాతం వరకు చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే మన దేశానికి చేరుతుంది. ఈ వాణిజ్య మార్గం మూసివేసిన నేపథ్యంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు.
విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ తన కాన్యాయ్ ను కేవలం రెండు వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రధాని బాటలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉప ముఖ్య మంత్రులు తమ కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకున్నారు.
ఇటీవల దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్, వాహనాల వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని ప్రకటించారు. ఈ నిర్ణయాలు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి తన అధికారిక కాన్వాయ్ ను కూడా దాదాపు 60 శాతం తగ్గించారు. కేవలం నాలుగు వాహనాలకు పరిమితం చేశారు. ఇప్పుడు దిల్లీ బాటలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ కార్మిక శాఖ సమావేశం అనంతరం.. కీలక నిర్ణయాలను అమలు చేయనున్నట్లు ప్రకటనలు చేసింది. పెద్ద పెద్ద సంస్థలు, పారిశ్రామిక యూనిట్లు తమ ఉద్యోగులకు వారంలో రెండు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరూ ఒకే సమయానికి ఆఫీసులకు రాకుండా వివిధ సమయాల్లో వేర్వేరు షిఫ్టులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అలాగే ఉద్యోగులు తమ సొంత వాహనాలకు బదులుగా ప్రభుత్వ లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.












Click it and Unblock the Notifications