హైదరాబాద్: అధికార కాంగ్రెసు ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసం చెల్లకుంటే శనివారం ప్రత్యేక సమావేశాల సందర్భంగా మరొక నోటీసు ఇవ్వాలని పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సభాపతి ఎన్నిక కోసం జరుగుతున్న ప్రత్యేక సమావేశాలలో అవిశ్వాసంపై ఇచ్చిన నోటీసు చెల్లదని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దీనిని సభాపతి ఆమోదించక పోవచ్చని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మరో నోటీసు ఇచ్చి కాంగ్రెసు, జగన్‌ను ఒత్తిడికి గురి చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
సభాపతి ఎన్నిక కోసం సహకరించాలని ఇప్పటికే టిఆర్ఎస్, పిఆర్పీ, ఎంఐఎం తదితర పార్టీలతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. టిడిపి సభాపతి పోటీలో కెఇ కృష్ణమూర్తిని నిలబెడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీధర్ బాబు చంద్రబాబుతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించాలని కోరనున్నారు. అయితే ఒక్క ఎమ్మెల్యే ఉన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని మాత్రం అధికార కాంగ్రెసు సభాపతి ఎన్నికకు సహకరించాలని కోరలేదు.