మిలిటెంట్ తరహా ఉద్యమం: ఆజాద్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి, ఈటెల మండిపాటు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ అంశం ఇప్పటికిప్పుడు తేలేది కాదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ సోమవారం మండి పడ్డారు. కాంగ్రెసు నయవంచన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితి లేదని ఈటెల అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఇక మాటలు కాదని చేతల సమయం వచ్చిందని ఆయన అన్నారు. మిలిటెంట్ తరహా ఉద్యమాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో కాంగ్రెసు పార్టీ నిజస్వరూపం బయట పడిందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం ఎన్నో తప్పులు చేశారని ఆయన ఆరోపించారు.