సొంత గూటికి ఉమాభారతి: యుపి బాధ్యతలు అప్పగించిన గడ్కరీ
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి తిరిగి తన మాతృపార్టీ భారతీయ జనతా పార్టీలో మంగళవారం చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సమక్షంలో ఉమా భారతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గడ్కరీ ఆమెను పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. వచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమెకు యుపి ఎన్నికల బాధ్యతను అప్పగించారు. ఉమా భారతీ తిరిగి తన సొంత గూటికి ఆరేళ్ల తర్వాత చేరింది. గతంలో అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీతో విభేదించి ఆమె పార్టీ నుండి బయటకు వెళ్లి పోయారు. నవంబర్ 2004లో ఉమాభారతిని పార్టీ బహిష్కరించింది. అప్పుడు అద్వానీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను బహిష్కరించారు.
ఆ తర్వాత ఆ సస్పెన్షన్‌ను ఎత్తి వేసినప్పటికీ ఆమె తిరిగి బిజెపిలో చేరలేదు. భారతీయ జన శక్తి పార్టీని స్థాపించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని ఆమె విభేదించారు. 2003లో మధ్యప్రదేశ్‌లో బిజెపి ఆధికారంలోకి రావడానికి ఆమె శాయశక్తులా కృషి చేశారు. అయితే ఆమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.